నవతెలంగాణ – హైదరాబాద్: ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, సీతాఫల్‌మండీ, తెలంగాణ రాష్ట్ర వారసత్వ శాఖ (Department of Heritage, Telangana) మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడి గారు, కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. బంగ్లా భారతి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొ. అర్జున్ రావు కూతాడి గారు మాట్లాడుతూ.. “ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తెలుసుకోవడం, సంరక్షించడం మరియు ప్రచారం చేయడంలో భాగస్వాములవుతారు. యువతలో వారసత్వ చైతన్యం పెంపొందించడం చాలా ముఖ్యమని” అన్నారు.
ప్రిన్సిపాల్ ప్రొ. జి. బంగ్లా భారతి గారు మాట్లాడుతూ.. “వారసత్వ శాఖతో కుదిరిన ఈ MoU విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం, చారిత్రక అవగాహన మరియు పరిశోధన అవకాశాలు కల్పిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు తెలంగాణ వారసత్వ పరిరక్షణలో తమ పాత్రను చాటుతారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారసత్వ శాఖ ఉప సంచాలకులు పి. నాగరాజు గారు, సూపరింటెండెంట్ రాజు గారు, కాలేజ్ సామాజిక శాస్త్ర విభాగాధిపతి బి. వెంకటేశం గారు, చరిత్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ ఎస్. కిషోర్ గారు పాల్గొన్నారు.



