Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణా శాఖ మెరుపుదాడులు

రవాణా శాఖ మెరుపుదాడులు

- Advertisement -

రెండ్రోజుల్లో 1050 వాహనాలపై కేసులు.. 750 సీజ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు రెండు రోజుల్లోనే.. ఈనెల 12, 13 తేదీలలో 1050 వాహనాలపై కేసులు నమోదు చేసి, వాటిలో 750 వాహనాలను సీజ్‌ చేసినట్టు రవాణాశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో 33 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఓవర్‌ లోడ్‌, ఫిట్‌నెస్‌ లేకపోవడం, త్రైమాసిక పన్ను చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారించాయి.

ఓవర్‌ లోడ్‌పై ఉక్కుపాదం
ఓవర్‌ లోడ్‌ సమస్యను క్వారీలు, రీచ్‌ల వద్దనే నియంత్రించడానికి రవాణా శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఓవర్‌ లోడ్‌కు అనుమతిస్తున్న క్వారీ, రీచ్‌ యజమానులపై చర్యలు తీసుకోవాలని మైనింగ్‌ శాఖకు సిఫారసు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఓవర్‌ లోడ్‌తో పట్టుబడిన వాహనాల పర్మిట్‌తో పాటు, ఆ వాహనాన్ని నడిపిన డ్రైవర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా సస్పెండ్‌ చేయనున్నామని హెచ్చరించారు. ఈ విషయంలో మైనింగ్‌ శాఖతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా వ్యవహరిస్తామని రవాణ శాఖ స్పష్టం చేసింది.

ఇతర ఉల్లంఘనలపై కఠిన చర్యలు
ఓవర్‌ లోడ్‌తోపాటు వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ (ఎఫ్‌సీ) లేకపోయినా, త్రైమాసిక పన్ను చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్నా తక్షణమే సీజ్‌ చేస్తామని రవాణ శాఖ హెచ్చరించింది. చేవెళ్ల ప్రమాదం అనంతరం వారం రోజుల్లోనే నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహన యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రవాణా శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -