దేవుడి పేరు మీద ఓట్లడిగేవారికి బుద్ధి చెప్పాలి
గత బీఆర్‌ఎస్ పాలనలో వేలకోట్ల అవినీతి : పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్
ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్‌రెడ్డికి నిజామాబాద్‌లో సన్మానసభ
నవతెలంగాణ-కంఠేశ్వర్
’42శాతం బీసీ రిజర్వేషన్‌పై బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ నోరు మెదపడం లేదని, దేవుడు పేరు మీద ఓట్లు అడిగేవారికి భవిష్యత్‌లో బుద్ది చెప్పాలని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో వేలకోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించి.. మొదటిసారిగా నిజామాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా గురువారం నగరంలోని పులాంగ్ చౌరస్తా నుంచి పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పట్టణ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన సన్మాన సభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారులు కాదని.. జిల్లా నుంచి అయనే మంత్రి అని అన్నారు.
నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన ఘనత సుదర్శన్ రెడ్డికే దక్కిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్-నిజామాబాద్ టెంపుల్ కారిడార్‌కు రూ.360 కోట్ల రోడ్డు నిధులు మంజూరయ్యాయని, త్వరలో లింబా ద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌస్‌లు నిర్మించబోతున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాను వ్యవసాయ, విద్యా, వైద్యపరంగా ముందంజలో ఉంచనున్నామన్నారు. బోధన్‌లో పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందని, అవకాశాలు కూడా కల్పిస్తామ న్నారు. గత ప్రభుత్వం హయాంలో నేతలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి డబ్బులు దోచుకెళ్లారని విమర్శించారు.
అనంతరం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. సుదర్శన్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థుల కలైన.. ఇంజనీరింగ్ కాలేజీ, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. పాఠశాల, ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు చెప్పారు. తనపై పెట్టిన బాధ్యతతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళతానన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. రూ.200 కోట్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాకీలు కట్టామని తెలిపారు. వ్యవసాయం పరంగా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని, త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.500కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, చైర్మెన్లు కేశవేణు, తాహెర్‌బిన్ హందాన్, ముప్ప గంగారెడ్డి, అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు నగేష్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, నరాల రత్నాకర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



