Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆరోగ్యమిత్రల జీతాల పెంపు ప్రతిపాదనలకు ఆర్థికశాఖ అడ్డు

ఆరోగ్యమిత్రల జీతాల పెంపు ప్రతిపాదనలకు ఆర్థికశాఖ అడ్డు

- Advertisement -

జోక్యం చేసుకుని న్యాయం చేయండి : సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డికి టీయూఎంహెచ్‌ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆరోగ్యమిత్రల జీతాల పెంపు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఆర్థికశాఖ అడ్డు పడుతున్నదనీ, జోక్యం చేసుకుని న్యాయం చేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయూఎంహెచ్‌ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు భూపాల్‌, ఆరోగ్యశ్రీ మిత్రల రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, సీనియర్‌ నాయకులు డీజీ నరసింహారావు తదితరులు సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి ద్వారా సీఎం రేవంత్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఆరోగ్యమిత్రలకు రూ.19,600 జీతం ఇస్తామనీ, డీఈవో క్యాడర్‌లోకి మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆ శాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో అనేక ప్రతిపాదనలు తయారు చేసి రెండు, మూడు సార్లు ఆర్థిక శాఖకు పంపించినా ఆ శాఖ కార్యదర్శి తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే 15 నుంచి 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న 900 మంది న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. ఆరోగ్యమిత్రలు చేస్తున్న పనికీ, వారికి చెల్లిస్తున్న జీతానికీ సంబంధం లేకుండా ఉందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి వేం నరేందర్‌ రెడ్డికి వివరించారు.

సీఎంతో చర్చిస్తా : వేం నరేందర్‌ రెడ్డి
వినతిపత్రాన్ని స్వీకరించిన వేం నరేందర్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించి ఆర్థిక శాఖలో పని జరిగేలా చర్యలు తీసుకుంటా నని ఆయన హామీ ఇచ్చారు.

ప్రయివేటు ఇంజినీరింగ్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి న్యాయం చేయాలి
రాష్ట్రంలో 165 ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని 30 వేల మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి న్యాయం చేయాలని సీపీఐ(ఎం) జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీనియర్‌ నాయకులు డీజీ నరసింహారావు, ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలల నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు తదితరులు సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచిన ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు తెలంగాణ వచ్చాక అన్యాయం చేస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందితో వెట్టిచాకిరి చేయించుకుంటున్న యాజమాన్యాలు ప్రభుత్వంతో రకరకాల సమస్యలపై పోరాడి పరిష్కరించు కుంటున్నాయని చెప్పారు. ఈ విషయంపై కమిషనర్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీతో చర్చిస్తే, ప్రభుత్వ కమిటీ సూచిస్తే జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇస్తామని చెప్పినట్టు గుర్తుచేశారు. జీవో లేనందునే జీతాలు పెంచడం లేదని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు కూడా తప్పించు కుంటున్నాయని తెలిపారు.

ఐఏఎస్‌ ఆఫీసర్ల కమిటీకి పంపిస్తా : వేం నరేందర్‌ రెడ్డి
వినతిపత్రాన్ని ఐఏఎస్‌ ఆఫీసర్ల కమిటీ పంపిస్తానని వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు. ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని ఆయన తెలిపారు. ఆయా కాలేజీల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -