Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపురపాలకం అస్తవ్యస్తం

పురపాలకం అస్తవ్యస్తం

- Advertisement -

సీఎం నిర్వహిస్తున్న శాఖ పనుల్లో అలసత్వం
రికమండేషన్‌ లేఖలతో అధికారులకు బాధ్యతలు
సీఎం చెబుతున్నా పట్టించుకోని అధికారులు
ఎవరికి వారే అన్నట్టుగా ఆఫీసర్ల తీరు
టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అక్రమ అనుమతులు
కొత్త మున్సిపాల్టీల్లో కనీస సౌకర్యాలూ శూన్యం
గత ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి.. ఇప్పుడూ అదే తంతు
పార్కులు, రోడ్ల కబ్జాపై హైడ్రా చేస్తున్న పనులకు ఆటంకాలు


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న పురపాలకశాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. సరైన నియంత్రణ లేదు. పనులు ఎక్కడికక్కడ కుంటుపడిపోయి సమస్యలు తాండవిస్తున్నాయి. కొత్త మున్సిపాల్టీల్లో కనీస సౌకర్యాలూ కరువయ్యాయి. చాలా చోట్ల మున్సిపల్‌ కమిషనర్ల పాలనా తీరు విమర్శలకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపాల్టీలకు అర్హత, అనుభవం లేని కమిషనర్లను నియమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. వారు ఏమి పనిచేస్తున్నారో అర్థంకాని దుస్థితి.

మున్సిపాల్టీలు సెలక్షన్‌ గ్రేడ్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3గా ఉంటాయి. గ్రేడ్‌ల ఆధారంగా అర్హతున్న అధికారులు, కమిషనర్లను నియమించాలి. కానీ రాష్ట్రంలో చాలా చోట్ల గ్రేడ్‌-1 మున్సిపాల్టీల్లో గ్రేడ్‌-3 ఆఫీసర్లు కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులుగా సచివాలయంలో పనిచేసి వచ్చిన వారు కమిషనర్లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు ఎక్కువగా హైదరాబాద్‌ శివారు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఉన్నాయి. మున్సిపాల్టీలపై పూర్తి అవగాహన లేని ఏఎస్‌వో, ఎస్‌వోలను సైతం మూడు గ్రేడ్‌ల మున్సిపల్‌ కమిషనర్లుగా విధులు అప్పగించారు. ఇలా సరైన అర్హత లేని వారిని కమిషనర్లుగా నియమిస్తుండటంతో పాలన ఆగమాగంగా కొనసాగుతోంది.

అవినీతి ‘రోత’
పారిశుద్ధ్యం, పాలనా విభాగాల్లో అనేక లోపాలున్నా సరిచేయాల్సిన అధికారులు మిన్నకుంటున్నారు. దీనికి ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం కూడా తోడవటంతో మున్సిపాల్టీల్లో అవినీతి ‘రోత’ పుట్టిస్తోంది. ఫైల్‌కో రేటు నిర్ణయించి మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌కు తూట్లు పొడుస్తున్నారు. కొంతమంది కమిషనర్లు, అధికారులు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా నకిలీ ఫైల్స్‌ తయారు చేసి డబ్బులు గుంజుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు మున్సిపాల్టీల్లో ఖాళీ జాగాలకు సైతం ఇంటినంబర్లు ఇస్తుండటం టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది.

ఖమ్మం మధిర మున్సిపాల్టీలో ఎలాంటి ఆధారంగా లేకుండా ఓ వ్యక్తికి ఇంటి నెంబర్‌ ఇచ్చిన అధికారులు.. అదే ఖాళీ స్థలానికి వాస్తవ యజమానికి, మరొకరికి బిల్డింగ్‌ పర్మిషన్‌ ఇవ్వటం హైకోర్టు వరకూ వెళ్లింది. ఖమ్మం కార్పొరేషన్‌లో స్వచ్ఛ వాహనాల విషయంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏ మున్సిపాల్టీలోనైనా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సరిగ్గా పనిచేస్తున్న దాఖలాలు లేవు. రెవెన్యూ విభాగంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. రాష్ట్ర పురపాలక శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఒకరి తర్వాత ఒకరు ఏసీబీకి పట్టుబడుతున్నా వీరి ధన దాహార్తి తీరటం లేదు. దీనంతటికీ పై స్థాయిలో ఉదాసీనతే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తున్నా వాటిని అత్యధిక మంది పాటించడం లేదు. ఆయన అదేశాలను చాలామంది భేఖాతరు చేస్తుండటం గమనార్హం.

పారిశుధ్యం అస్తవ్యస్తం
మున్సిపాల్టీల్లో పారిశుధ్య వ్యవస్థ తీరు మరింత అధ్వాన్నంగా ఉంటోంది. నూతన మున్సిపాల్టీల్లో ఇది మరింత దారుణంగా తయారైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సంబంధిత పనులకు వెచ్చిస్తున్నారా? లేదా? అనే దానిపైనా పర్యవేక్షణ లేదు. ఇటీవల ప్రిన్సిపల్‌ సెక్రటరీ నిర్వహించిన వెబ్‌ ఎక్స్‌ మీటింగ్‌లో చెప్పిన సమాధానాలు సైతం పై అధికారికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయంటే కిందిస్థాయి అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రూ.లక్షలు ముట్టజెప్పి పోస్టింగులు
రూ.లక్షలు ముట్టజెప్పి అధికారులు పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారన్న చర్చ అయితే ఉంది. కొందరు అక్రమ పద్ధతిలో డిప్యూటేషన్లు సైతం పొందుతున్నారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మున్సిపాల్టీల్లో కమిషనర్లుగా పనిచేస్తున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు, మాజీ ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ముట్టజెప్పి అర్హత లేకున్నా కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రోడ్లు, పార్కులు, ప్రభుత్వం స్థలాలను కబ్జాల భారీ నుంచి రక్షించేందుకు సీఎం హైడ్రాను ఏర్పాటుచేసినా కొంతమంది కమిషనర్లు పట్టించుకోవడం లేదు. జనం ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా వచ్చి రోడ్లు, పార్కుల కబ్జాలను కాపడుతుంటే శివారు మున్సిపాల్టీల్లో ఉన్న కమిషనర్లు దానికి ప్రతిబంధకంగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. సీఎం నిర్వహిస్తున్న శాఖలో ఇంత బాహాటంగా నిబంధనలు ఉల్లంఘిస్తుంటే చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలోని అనేక మున్సిపాల్టీల్లో టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది ఇలాగే అక్రమాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఖమ్మం వంటి చోట కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యకు మేయర్‌ పునుకొల్లు నీరజకు పొసగట్లేదనే టాక్‌ ఉంది. కమిషనర్‌కు తెలియకుండా మేయర్‌ తనకు నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీడీఎంఏ కార్యాలయంలో తిష్టవేసిన ఇద్దరు అధికారులు అవినీతికి అలవాటుపడి ఇష్టానుసారంగా బదిలీలు చేయిస్తున్నా కీలక పురపాలకశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి వీటిని పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -