– టైగర్ సఫారీపై పెరుగుతున్న క్రేజ్
– ఏటా పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య
– విదేశాల నుంచి కూడా వస్తున్న సందర్శకులు
– అటవీశాఖకు పెరుగుతున్న ఆదాయం
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
నల్లమల అటవీ ప్రాంతం సహజసిద్ధమైన అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జలపాతాలకు పెట్టింది పేరు. వందల సంవత్సరాల ఆదిమజాతికి ఈ ప్రాంతం పుట్టినిల్లు. విప్లవ ఉద్యమాల ప్రభావం, అటవీ శాఖ తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో కుంటుపడిన పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటోంది. అటవీశాఖకు ఆదాయం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.
20 వేల మంది పర్యాటకులు
నాగర్‌కర్నూల్ జిల్లాలో దాదాపు 2.75లక్షల హెక్టార్లలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటవీ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. టైగర్ సఫారీని 2020-21లో 5,321 మంది సందర్శించగా, అటవీ శాఖకు రూ. 9.12 లక్షల ఆదాయం సమకూరింది. 2021-22లో 1,362 సఫారీ ట్రిప్పుల్లో 9,534 మంది పర్యాటకులు నల్లమల అందాలను వీక్షించారు. తద్వారా రూ. 1.14లక్షల ఆదాయం వచ్చింది. 2022-2023లో 1,362 మంది పర్యాటకులు నల్లమలలో పర్యటించగా, రూ. 2.72 లక్షలు, 2023-24లో రూ. 6.38 లక్షలు, 2024-25లో 20,195 మంది పర్యటించగా, రూ. 7.21 లక్షల ఆదాయం సమకూరింది. నల్లమల అటవీ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు ఇతర రాష్ట్రాల వారినే కాకుండా విదేశీయులను కూడా ఆకర్షిస్తోంది. గత ఏడాది దాదాపు 22 మంది స్విట్జర్లాండ్, న్యూజిలాండ్‌కు చెందిన వారు, అమెరికాలో నివసించే ప్రవాస భారతీయులు కూడా నల్లమలను సందర్శించారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణించి ఆనందించారు. అలాగే ఉమామహేశ్వరం, లొద్దిమల్లయ్య, బౌరాపురం, మల్లెలతీర్థం తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో ఆదాయం క్రమంగా పెరుగుతోంది.



