నవతెలంగాణ-కథనానికి స్పందించిన డిసిపిఓ..
– బాలల భద్రతకు చర్యలు ప్రారంభం..
నవతెలంగాణ-వేములవాడ : అద్దె కట్టలేక రోడ్డున పడిన కుటుంబం గురించి గురువారం నవతెలంగాణలో ప్రచురితమైన కథనంపై శుక్రవారం జిల్లా శిశు పరిరక్షణ అధికారి (డిసిపిఓ) కవిత స్పందించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. హనుమాజీపేటకు చెందిన వరలక్ష్మి, తన కూతురు మానసతో కలిసి వేములవాడలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అద్దె చెల్లించలేకపోవడంతో ఇంటి యజమాని ఇల్లును ఖాళీ చేయించడంతో, గత మూడు రోజులుగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని బహిరంగ ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నట్టు తెలిసింది.
ఈ వార్త నవతెలంగాణలో ప్రసారం కావడంతో జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత, సఖి పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వరలక్ష్మి–మానసలను కలిసి వివరాలు సేకరించారు. మానస కుమారుడు, కుమార్తెలకు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా జిల్లా సంక్షేమ అధికారుల ఎదుట హాజరు పరచి, అవసరమైన చర్యలు తీసుకుంటామని డిసిపిఓ కవిత తెలిపారు.బాలల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లాలో బాలలకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది తోపాటు తదితరులు ఉన్నారు.



