మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య
ఘనంగా బాలల దినోత్సవం
నవతెలంగాణ-పాలకుర్తి
విద్యార్థిని, విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడే బాలల దినోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య అన్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో గల ప్రగతి విద్యాలయం, సిద్ధార్థ విద్యాలయం, సుధా టెక్నో స్కూల్, కార్మెల్ కాన్వెంట్ స్కూల్, చెన్నూరులో గల మహర్షి విద్యా మందిర్ తో పాటు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి నెహ్రూ వలె ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లు వీరమనేని వెంకటేశ్వరరావు, జక్కుల రవీందర్, రాపాక విజయ్, నరేందర్ రెడ్డి, చారి, లిజ్ బెత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో 20 సంవత్సరాల వేడుకలు
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో గల కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో బాలల దినోత్సవం త పాటు 20 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరింప చేశాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, డాక్టర్ ఉడుముల బాల, విజయ పాల్ రెడ్డి, మరియా అగస్టిన్, పాఠశాల ప్రిన్సిపాల్ లిజ్ బెత్ లతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



