Saturday, November 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిబీమా రంగంపై కార్పొరేట్‌ పడగ

బీమా రంగంపై కార్పొరేట్‌ పడగ

- Advertisement -

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌.ఐ.సి) ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత పది బీమా కంపెనీలలో మూడవ స్థానంలో ఉంది. భారతదేశంలోని 23 ఇన్సూరెన్స్‌ కంపెనీల పోటీ మధ్య నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నది. దీనికి ప్రధాన కారణం కంపెనీకి రాయబారులుగా పనిచేస్తున్న 14 లక్షల మంది ఎల్‌ఐసి ఏజెంట్లు. వారు తమ పాలసీ అమ్మకాలు, సేవల ద్వారా పాలసీదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. దీనివల్లనే ఎల్‌ఐసి ఈ స్థాయికి ఎదిగింది. కేంద్ర ప్రభుత్వ పంచవర్ష ప్రణాళికల నుండి దేశంలోని అభివృద్ధి పనులు, భారీ నిర్మాణాలు, రాష్ట్ర ప్రభుత్వ-స్థానిక సంస్థలు చేపట్టే ప్రజాప్రయోజన ప్రాజెక్టుల కోసం సుమారు రూ.39 లక్షల కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ప్రజల సంక్షేమం కోసం ఎల్‌ఐసి అందించింది. ప్రస్తుతం ఎల్‌ఐసి లైఫ్‌ ఫండ్‌ రూ.47.84 లక్షల కోట్లు. వివిధ సంస్థలలో ఎల్‌ఐసి పెట్టుబడుల విలువ రూ.54.52 లక్షల కోట్లు. అదేవిధంగా 2025 మార్చి నాటికి రూ.57 లక్షల కోట్ల ఆస్తులను ఎల్‌ఐసి కలిగి ఉన్నది. గత 68 సంవత్సరాలుగా దేశ ప్రజల సహకారంతో ఈ భారీ మొత్తాన్ని సేకరించగలిగింది.

నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ బీమా సంస్థలను అస్థిరపరచి, ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే కార్యక్రమం జరుగుతున్నది. ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పి 1994లో ఆర్‌.యన్‌.మల్హోత్రా కమిటీని, 2009లో డి.స్వరూప్‌ కమిటీని నియమించారు. ఈ రెండు కమిటీలు కూడా పాలసీదారులు, ఏజెంట్లు, ఎల్‌ఐసి సంస్థకు నష్టం కలిగించే అనేక సిఫార్సులు చేసి పరోక్షంగా ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు తోడ్పడే పని చేశాయి. యుపిఎ-1, యుపిఎ-2 ప్రభుత్వాల సమయంలో వామపక్ష పార్లమెంటు సభ్యుల సహకారంతో వీటిని అమలు కాకుండా ఎల్‌ఐసి ఎఒఐ మిగతా యూనియన్లను కలుపుకుని పోరాటం చేసి నిలుపుదల చేయించగలిగింది. కానీ 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిఫార్సులను వేగంగా అమలు చేశారు. ఫలితంగా ఇన్సూరెన్స్‌ మార్కెట్లో ప్రయివేటు కంపెనీలో ఆధిపత్యం క్రమేణా పెరుగుతున్నది.

ఈ రెండు కమిటీల సిఫార్సుల మేరకు అమలు చేసిన విధానాల వల్ల 2022లో ఐపీఓ ద్వారా 3.5 శాతం ఎల్‌ఐసి షేర్లను విక్రయించి రూ.20,557 కోట్లు కేంద్ర ప్రభుత్వం పొందింది. అంతేగాక ఈ సంవత్సరం పది శాతం షేర్లను, 2030 నాటికి 25 శాతం షేర్లను విక్రయించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల ఎల్‌ఐసికి రావాల్సిన ఆరు లక్షల కోట్ల ప్రీమియాన్ని ఇప్పటి వరకు కోల్పోయింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా గతంలో ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టి తద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు చెల్లించే అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఐ.ఆర్‌.డి.ఎ.ఐ సూచనల మేరకు 2024 అక్టోబర్‌ నుండి ఇన్సూరెన్స్‌ పాలసీలలో అనేక కొత్త మార్పులు వచ్చాయి.

ఒకవైపు పాలసీ సులభంగా రద్దు చేసుకునే అవకాశం పాలసీదారుడికి ఇచ్చి, మరోవైపు పాలసీ రద్దయితే ఆ పాలసీపై ఏజెంట్‌ ఆపాటికే పొందిన కమిషన్‌ను తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పడం ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. పాలసీదారులకు ప్రీమియం రేటు పెంచడంతోపాటు పాలసీ లోన్లపై 8 శాతం నుండి 10 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. మరోవైపు ఏజెంట్లకు కొత్త సౌక ర్యాలు కల్పించకపోగా ఉన్న వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. వీటితోపాటు ఆన్‌లైన్లో పాలసీలు విక్రయించడం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ఉన్నట్లుగా పాలసీ పోర్టబిలిటీ జీవిత బీమాలో కూడా ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది ఎల్‌ఐసి సంస్థకు పెద్ద ఎదురు దెబ్బ. ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు పెద్ద వరంగా మారుతుంది. ఈ విధానాల వల్ల ఎల్‌ఐసి సంస్థకు, పాలసీదారులకు, ఎల్‌ఐసి ఏజెంట్లకు అందరికీ నష్టమని ప్రభుత్వానికి తెలిసే వాటిని ప్రోత్సహిస్తున్నది. కాబట్టి ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలంటే గతం కంటే మరింత ఎక్కువ సంఘటితంగా పోరాడాలి. ఈ పోరాటంలో ఉద్యోగులను, పాలసీదారులను, భావ సారూప్యం కలిగిన వ్యక్తులను, సంస్థలను కలుపుకొని ఐక్య ఉద్యమాలను నిర్వహించాలి.
-ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -