తొలి ఇన్నింగ్స్‌లో 159 ఆలౌట్
ఐదు వికెట్లతో బుమ్రా బూమ్‌బూమ్
రెండు వికెట్లతో మెరిసిన కుల్‌దీప్, సిరాజ్
జైస్వాల్ నిష్క్రమణ, భారత్ తొలి ఇన్నింగ్స్ 37/1
ఈడెన్‌గార్డెన్స్ టెస్టు తొలి రోజు
ఈడెన్‌గార్డెన్స్‌లో బుమ్రా షో. బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌పై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడిన బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. బుమ్రా ఐదు వికెట్ల మ్యాజిక్‌కు.. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మాయాజాలం, పేసర్ సిరాజ్ సహకారం దక్కటంతో దక్షిణాఫ్రికా ఈడెన్‌గార్డెన్స్‌లో విలవిల్లాడింది. 57/0తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా.. బుమ్రా, కుల్‌దీప్, సిరాజ్ దెబ్బకు 159 పరుగులకే కుప్పకూలింది.
నవతెలంగాణ-కోల్‌కతా
భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా (5/27) ఐదు వికెట్లతో చెలరేగాడు. అద్భుత నైపుణ్యం, అసమాన వైవిధ్యంతో బంతులేసిన జశ్‌ప్రీత్ బుమ్రా.. సఫారీ బ్యాటర్లను వణికించాడు. జశ్‌ప్రీత్ బుమ్రాకు తోడు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (2/36), మహ్మద్ సిరాజ్ (2/47) రాణించటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఎడెన్ మార్‌క్రామ్ (31, 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), వియాన్ ముల్డర్ (24, 51 బంతుల్లో 3 ఫోర్లు), టోనీ (24, 55 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సఫారీ తరఫున టాప్ స్కోరర్లుగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైంది. మూడో సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 37/1తో ఆడుతోంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (13 నాటౌట్, 59 బంతుల్లో 2 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్, 38 బంతుల్లో) అజేయంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకో 122 పరుగుల వెనుకంజలో నిలిచింది.
ఓపెనర్లు మెరిసినా..
టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ఈడెన్‌గార్డెన్స్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ల జోరుతో సఫారీ నిర్ణయం సముచితమే అనిపించింది. ఎడెన్ మార్‌క్రామ్ (31), రియాన్ రికెల్టన్ (23)లు తొలి వికెట్‌కు 57 పరుగులతో శుభారంభం అందించారు. ఓపెనర్లు దూకుడుగా రాణించటంతో తొలి పది ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 57 పరుగులు పిండుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే సంకేతాలతో సఫారీలు భారీ స్కోరు చేయగలదనే అంచనాలకు ఊతం లభించింది. కానీ వరుస ఓవర్లలో ఓపెనర్లను అవుట్ చేసిన బుమ్రా.. దక్షిణాఫ్రికాకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
సఫారీ విలవిల
ఓ వైపు, మరో వైపు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మ్యాజిక్‌తో సఫారీ వేగంగా వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన వియాన్ ముల్డర్ (24), టోనీ (24)లను కుల్‌దీప్, బుమ్రాలు సాగనంపారు. కెప్టెన్ తెంబ బవుమా (3) కుల్‌దీప్ ఓవర్లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. అప్పటికి సఫారీలు 32.3 ఓవర్లలో 120 పరుగులకు ఐదు వికెట్లు నష్టోయింది. తొలి రెండు స్పెల్స్‌లో లయ అందుకోని మహ్మద్ సిరాజ్‌కు మరోసారి బంతి ఇచ్చిన శుభ్‌మన్ గిల్.. మరో బ్రేక్ సాధించాడు. ఒకో ఓవర్లో కైల్ వెరెనె (16), మార్కో జాన్సెన్ (0) వికెట్లతో సిరాజ్ వికెట్ల వేటలో భాగమయ్యాడు. టీ విరామం తర్వాత ఒకే ఓవర్లో హార్మర్ (5), కేశవ్ మహరాజ్ (0) వికెట్లతో బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేయగా.. దక్షిణాఫ్రికా పతనం పరిపూర్ణమైంది.
జైస్వాల్ అవుట్
తొలి రోజు ఆఖర్లో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) వికెట్‌ను కోల్పోయింది. మూడు ఫోర్లతో మెరిసిన యశస్వి జైస్వాల్.. జాన్సెన్ ఓవర్లో కట్ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (13 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 37/1తో ఆడుతోంది. తొలి టెస్టు తుది జట్టులో భారత్ విప్లవాత్మక మార్పులు చేసింది. మూడో స్పిన్ ఆల్‌రౌండర్ లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం పోటీ నెలకొనగా.. గిల్, గంభీర్ మూడో స్పిన్ ఆల్‌రౌండర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ ఇద్దరినీ జట్టులోకి తీసుకున్నారు. టాప్ ఆర్డర్‌లో నం.3 బ్యాటర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. దీంతో కోలకతా టెస్టులో భారత్ నలుగురు స్పిన్నర్లతో ఆడుతోంది.
వివాదంలో బుమ్రా!
భారత క్రికెటర్లు జశ్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌లు వివాదంలో చిక్కుకున్నారు. సఫారీ కెప్టెన్ తెంబ బవుమాపై అభ్యంతర వ్యాఖ్యలు చేయటంతో విమర్శలు వస్తున్నాయి. బుమ్రా ఓవర్లో బవుమా ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ నిరాకరించాడు. రివ్యూ తీసుకునేందుకు చర్చించే సమయంలో బవుమాను ఉద్దేశించి బుమ్రా, పంత్‌లు ‘మరగుజ్జు’ అంటూ సంబోధించారు. సోషల్ మీడియీ ఈ వీడియో వైరల్‌గా మారింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : ఎడెన్ మార్‌క్రామ్ (సి) పంత్ (బి) బుమ్రా 31, రియాన్ రికెల్టన్ (బి) బుమ్రా 23, వియాన్ ముల్డర్ (ఎల్బీ) కుల్‌దీప్ 24, తెంబ బవుమా (సి) జురెల్ (బి) కుల్‌దీప్ 3, టోనీ (ఎల్బీ) బుమ్రా 24, ట్రిస్టన్ స్టబ్స్ నాటౌట్ 15, కైల్ వెరెనె (ఎల్బీ) సిరాజ్ 16, మార్కో జాన్సెన్ (బి) సిరాజ్ 0, కార్బిన్ బాచ్ (ఎల్బీ) అక్షర్ 3, హార్మర్ (బి) బుమ్రా 5, కేశవ్ మహరాజ్ (ఎల్బీ) బుమ్రా 0, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (55 ఓవర్లలో ఆలౌట్) 159.
వికెట్ల పతనం : 1-57, 2-62, 3-71, 4-114, 5-120, 6-146, 7-147, 8-154, 9-159, 1-159.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 14-5-27-5, మహ్మద్ సిరాజ్ 12-0-47-2, అక్షర్ పటేల్ 6-2-21-1, కుల్‌దీప్ యాదవ్ 14-1-36-2, రవీంద్ర జడేజా 8-2-13-0, వాషింగ్టన్ సుందర్ 1-0-3-0.
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (బి) జాన్సెన్ 12, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ 13, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ 6, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో ఓ వికెట్‌కు) 37.
వికెట్ల పతనం : 1-18.
బౌలింగ్ : మార్కో జాన్సెన్ 6-2-11-1, వియాన్ ముల్డర్ 5-1-15-0, కేశవ్ మహరాజ్ 5-1-8-0, కార్బిన్ బాచ్ 3-2-1-0, హార్మర్ 1-1-0-0.



