నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన మహాఘఠ్‌బంధన్ కేవలం 34 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమికి ఒక పాఠం లాంటివనితమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తూనే, కూటమి ఓటమిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
“బీహార్‌లో విజయం సాధించిన నితీశ్ కుమార్‌కు అభినందనలు. గట్టిగా పోరాడిన తేజస్వి యాదవ్‌ను కూడా అభినందిస్తున్నాను. ఎన్నికల ఫలితాలు అనేవి సంక్షేమ పథకాలు, సరైన పొత్తులు, రాజకీయ సందేశంపై ఆధారపడి ఉంటాయి. ఈ ఫలితాలు ఇండియా కూటమికి ఒక పాఠం. దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి” అని స్టాలిన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన నేతలు ఉన్నారని, సవాళ్లను అధిగమించే వ్యూహాలను వారు రచిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈసీపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేమని, దాని ప్రతిష్ట దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.



