– గద్వాల జిల్లాకు గర్వకారణం
– అభినందించిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పల్లెటూరి కుర్రాళ్ళు రూపొందించిన షార్ట్ ఫిల్మ్, పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 21 అక్టోబర్ 2025న నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్ ఫిలిం పోటీలో రెండవ బహుమతిని సాధించింది. హెల్మెట్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తూ వెళ్లే యువకుల నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాన్ని చూపిస్తూ “రెకమండేషన్లు కాదు… రోడ్డు భద్రతా నియమాలే మీ ప్రాణాలను కాపాడతాయి”అనే సందేశాన్ని అందించిన ఈ లఘు చిత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
నవంబర్ 14న హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో జరిగిన అవార్డు కార్యక్రమంలో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి చేతుల మీదుగా పల్లెటూరి కుర్రాళ్లు బహుమతిని అందుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ టీ. శ్రీనివాసరావు ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన టీమ్ సభ్యులు ఖదీర్, దేవేందర్, హరిఫ్రసాద్, రాజు, పరశురాo లను అభినందించారు. ఈ విజయంతో జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలో మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది.



