- తుప్పు పట్టిన పరికరాలు
- అట్టలుగా లేచిపోతున్న గ్రీన్ మ్యాట్స్
- ఆరంభంలో ఉన్న శ్రద్ధ నిర్వహణలో ఏదీ
- ఉపయుక్తంగా లేని ఓపెన్ జిమ్
- నిర్వహణ మరిచిన అధికారులు
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఓపెన్ జిమ్ తీరిది
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : ప్రజలకు శారీరక ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం పంచేందుకు ప్రభుత్వ స్థలాలు, పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు మూన్నాళ్ళ ముచ్చటగా మారాయి. మరమ్మతు లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆ లక్ష్యం నెరవేరడం లేదు. అడుగు పెట్టలేని విధంగా మారాయి. దాంతో లక్షల రూపాయలు నిరుపయోగమయ్యాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ శిథిలావస్తకు చేరుకుంది.
ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. శారీరక, మనసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రయివేటు జిమ్‌లకు వెళ్ళే ఆర్థిక వెసలుబాటు లేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఓపెన్ జిమ్‌లు ఎంతగానో ఉపయోగపడేవి. వృద్ధులు, పిల్లలు, యువకులు సమీపంలోని పార్కులకు వెళ్లి ఓపెన్ జిమ్ పరికరాలతో ఎక్సర్‌సైజులు చేసేందుకు, పిల్లల ఆట పరికరాలతో ఆడుకునేందుకు ఉపయోగంగా ఉంటాయని వీటిని ఏర్పాటు చేశారు.
మరమ్మతులు వచ్చిన పరికరాలు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని రాయపోల్ రోడ్డులో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. జిమ్ పరికరాలు, ప్లాట్‌పాం, గ్రీన్ మ్యాట్‌లకు కలిపి సుమారు రూ.10 లక్షల వరకు వెచ్చించారు. ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే పాడవడం, రిపేర్లు చేయించినా తరుచూ మరమ్మతుకు రావడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో పరికరానికి లక్ష నుంచి లక్షా 50 వేల వరకు వెచ్చించారు. నాసిరకం ఐరన్ పైపులు, షీట్‌లు, బేరింగులతో సరైన సాంకేతిక నైపుణ్యం లేని స్ధానికంగా ఉండే వెల్డింగు షాపుల్లో తయారు చేయించినట్లు సమాచారం. దీంతో తరుచూ పాడవుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఓపెన్ జిమ్‌లలో పరికరాలు వెల్డింగ్ చేసిన చోట ఊడిపోవడం, విరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి. సకాలంలో రిపేర్లు చేయించకపోవడంతో నెలల తరబడి వినియోగానికి పనికి రాకుండా వృథాగా పడి ఉంటున్నాయి.
కాంట్రాక్టర్లే నిర్వహణ చూడాల్సి ఉన్నా..
జిమ్ పరికరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టులో పేర్కొన్న నిబంధనలను బట్టి.. పరికరాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లే ఐదేళ్ల వరకు నిర్వహణను కూడా చూడాల్సి ఉంది. పరికరాలు పాడైనా, తుప్పు పట్టినా సదరు కాంట్రాక్టరే కొత్తవి ఏర్పాటు చేయడమో, బాగు చేయడమో చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఇది జరిగిన దాఖలాలు లేవు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఓపెన్ జిమ్‌లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోతున్నాయి. ఓపెన్ జిమ్‌లను స్థానిక యువతకు గానీ, అసోసియేషన్లకు గానీ అప్పగిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా తీసుకున్న చర్యలు లేవు.
మంచి పరికరాలతో..
ఓపెన్ జిమ్‌లో ఒక్కోచోట సుమారు రూ.10 లక్షల వరకు వెచ్చించి పరికరాలను అమర్చారు. పలుచోట్ల ఖరీదైన పరికరాలనూ ఏర్పాటు చేశారు. అల్డామినల్ రైడర్, వర్టికల్ షోల్డర్ పుల్, లెగ్ ఎక్స్టెన్షన్, కర్ల్ మిషన్లు, షోల్డర్ ట్విస్టర్లు, పుల్ చైర్స్, చెస్ట్ పుష్ మిషన్లు వంటివి అమర్చారు. కొత్తలో యువకులతో పాటు నడి వయస్కులు, మహిళలు ఓపెన్ జిమ్లకు వచ్చినా.. తర్వాత వాటి నిర్వహణ లోపం, యంత్రాలు పాడైపోవడంతో వారిలో ఆసక్తి తగ్గిపోయింది. చాలాచోట్ల పిల్లల ఆట స్థలాలుగా ఓపెన్ జిమ్‌లు మారిపోయిన పరిస్థితి ఉంది.
మరమ్మతు చేయించాలి : మాదరి శివ కుమార్

ఓపెన్ జిమ్ పరికరాలను వెంటనే మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకురావాలి. వాటితో పాటు పిల్లల ఆట పరికరాలను కూడా బాగు చేయించాలి. ఇక్కడ జిమ్ చేసుకోవడానికి వీలు లేకుండా పరికరాలు మరమ్మతు వచ్చాయి. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ జిమ్ లక్ష్యం నెరవేరడం లేదు. పరికరాలు బాగు చేయడంతో, మ్యాట్‌ను సైతం సరి చేయాలి.
వెంటనే మరమ్మతు చేయించాలి : బోడ యాదగిరి సీపీఐ(ఎం) మున్సిపల్ నాయకులు
మున్సిపాలిటీ అయినప్పటికీ వందలాది మంది ఉదయం, సాయంకాలం వాకింగ్ చేసేందుకు గ్రౌండ్, రోడ్ల ప్రక్కన వాకింగ్ చేస్తుంటారు. ప్రజలకు జిమ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినా ప్రజలకు జిమ్ చేసుకోవడానికి అనుకూలంగా లేదు. పరికరాలు సరిగ్గా లేవు. పట్టణం కేంద్రంలో ఏర్పాటు చేసినా జిమ్ బాగు చేసి వినియోగంలోకి తీసుకురావాలి




