నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో నిరాశపర్చిన భారత్.. బౌలింగ్‌లో మాత్రం అదరగొడుతోంది. భారత స్పిన్నర్ల ధాటికి సఫారీ జట్టు బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 93/7 స్కోరుతో నిలిచి 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోర్బిన్ బాష్ (1), తెంబా బావుమా (29) క్రీజులో ఉన్నారు. రవీంద్ర జడేజా (4/28) విజృంభించాడు. కుల్‌దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
ఓవర్‌నైట్ స్కోరు 37/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 189 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (39) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27) పరుగులు చేశారు. బ్యాటింగ్ చేస్తుండగా మెడ పట్టేయడంతో మైదానాన్ని వీడిన శుభ్‌మన్ గిల్ (4) మళ్లీ బ్యాటింగ్ చేయడానికి రాలేదు. సైమన్ హర్మర్ (4/30), మార్కో యాన్సెన్ (3/35) సత్తాచాటారు. ఈ క్రమంలోనే భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల ఆధిక్యం లభించింది.



