నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ బీజేపీలో బహిష్కరణల పర్వం కొనసాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి, బీహార్ సీనియర్ నేత ఆర్.కె.సింగ్ సహా ముగ్గురు రెబల్స్‌ను బిజెపి శనివారం సస్పెండ్ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకరోజు తర్వాత ఈ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆర్.కె.సింగ్ సహా ఎమ్మెల్యే అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌ను పార్టీ నుండి బహిష్కరించింది. బీహార్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్ అరవింద్ శర్మ ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. వారిని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో వారంలో వివరణనివ్వాలని నోటీసుల్లో కోరారు.
బీహార్‌లోని అర్రా నుండి ఎన్నికైన మాజీ ఎంపి సింగ్, 2024 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుండి బిజెపికి ఎదురుతిరిగారు. ఎన్‌డిఎ నాయకత్వం, మిత్రపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై విమర్శలు వచ్చిన వెంటనే ఆర్.కె.సింగ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బిజెపి కీలక అభ్యర్థి సామ్రాట్ చౌదరి, బిజెపి బీహార్ చీఫ్ దిలీప్ జైస్వాల్‌పై అవినీతి ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వివరణనివ్వాలని డిమాండ్ చేశారు. సామ్రాట్ చౌదరి, జైస్వాల్‌లు హత్య నిందితులు అని, అటువంటి వారికి ఓటు వేయవద్దని ప్రజలకు సూచించారు. చౌదరి విద్యార్హతపై సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని,. జెడియు నేత అనంత్ సింగ్‌కు కూడా ఓటు వేయవద్దని వ్యాఖ్యానించారు.



