Saturday, November 15, 2025
E-PAPER
Homeజిల్లాలురైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి

- Advertisement -

*ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

*కలెక్టర్ తో కలిసి అధికారులతో సమీక్ష

*ఆర్..బీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని వెల్లడి

నవతెలంగాణ నిజామాబాద్ సిటీ

జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆర్.ఓ.బీ పనుల పురోగతి, ధాన్యం కొనుగోళ్ళు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. నిజామాబాద్ రూరల్ మండలం మాధవనగర్, మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లి, నిజామాబాద్ అర్బన్ పరిధిలోని అర్సపల్లి ఆర్ ఓ బీల నిర్మాణ పనులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఆర్.ఓ.బీల నిర్మాణాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులను సైతం విడుదల చేసిందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. మాధవనగర్ ఆర్.ఓ.బీకి రూ. 3.15 కోట్లు, అర్సపల్లి ఆర్.ఓ.బీ పనుల కోసం రూ. 7.46 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు రవాణా పరంగా మరింత సౌలభ్యం కలిగేలా పనులను సకాలంలో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, పనులను సకాలంలో పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. నిర్దేశిత గడువును ఏర్పర్చుకుని యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టి పూర్తి చేయించేలా చొరవ చూపాలని అధికారులకు హితవు పలికారు. అడివిమామిడిపల్లి వద్ద బీ.టీ రోడ్డు తదితర పనులను పూర్తి చేసి, డిసెంబర్ 15 నాటికి వంతెనను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.

కాగా, జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంత రైతులు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరి పైరు నీటి మునిగి పంట దెబ్బతిన్నందున బాధిత రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగు మారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్ళు జరిగాయని, ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం సేకరణ పూర్తయ్యిందని, మరో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా, వారికి నష్టం వాటిల్లకుండా కొనుగోళ్ళ ప్రక్రియను సాఫీగా జరిగేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -