Sunday, November 16, 2025
E-PAPER
Homeమానవిపట్టుదలకు మారుపేరు పద్మావతి

పట్టుదలకు మారుపేరు పద్మావతి

- Advertisement -

చదువంటే పెద్దగా తెలియని కుటుంబంలో పుట్టారు. అయినా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని హిందీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రోత్సాహం లేకున్నా తల్లి ప్రోద్బలం, గురువుల సహకారంతో తన ప్రయాణం కొనసాగించారు. ఆత్మవిశ్వాసమే తన శ్వాసగా నడిచారు. విలువలు కలిగిన అధ్యపకురాలిగా గుర్తింపు పొంది 76 ఏండ్ల వయసులో సాహిత్య రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న పి.పద్మావతి పరిచయం నేటి మానవిలో…

నేను పుట్టింది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి. అమ్మ వేముల హనుమాయమ్మ, నాన్న పున్నయ్య. ఓ సాధారణ కుటుంబం మాది. తల్లిదండ్రులు లేని మా నాన్న వారి అన్నా, వదినల దగ్గర 14 ఏండ్లు పెరిగారు. అప్పట్లో ఒక్క రూపాయి దొంగిలించాడని దొంగతనం అంటగట్టారు. ఆ అపవాదు భరించలేక 15 ఏండ్ల వయసులోనే ఆత్మాభిమానంతో ఇల్లు వదిలి వచ్చేశారు. సైకిల్‌ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ 25 ఏండ్ల వయసులో సత్తెనపల్లిలో స్థిర పడ్డారు. వీరికి నేను మూడవ అమ్మాయిని.

నాన్నకు ఇష్టం లేదు
ఎవరి ఆధారం లేకుండానే చిన్నప్పటినుండి తన కాయకష్టంతో పెరిగిన నాన్నకు చదువుపట్ల అంత సదభిప్రాయం ఉండేది కాదు. అయితే గాంధీజీ అంటే విపరీతమైన అభిమానం. ఉన్నంతలో దానం చేయడం, అన్నమాట తప్పకపోవడం, ధర్మం పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉన్నవారు. ఊరి పెద్దగా కూడా పేరున్నవారు. మేము ముగ్గురం ఆడపిల్లలం. ఇద్దరు మగ పిల్లలం. మా నాన్నకు మగ పిల్లలను మాత్రం బాగా చదివించాలనే కోరిక ఉండేది. కానీ ఆడపిల్లలను చదివించాలనే ఆలోచనే ఉండేది కాదు. విద్యాబుద్ధులు తెలియని మా అమ్మకు మాత్రం ఆడపిల్లలను కనీసం ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకైనా చదివించాలనే కోరిక ఉండేది.

గురువు సహకారంతో
జీవన సంద్రంలో పడి లేచే కెరటాల ఆవలె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రాథమిక పాఠశాల వరకు పూర్తి చేశాను. ఉన్నత పాఠశాల మెట్లు కూడా ఎక్కని పరిస్థితి నాది. మా వీధిలో ఒక హైస్కూల్‌ ఉండేది. అందులో పని చేసే హిందీ మాస్టర్‌ శ్రీ వాసిరెడ్డి సుబ్బారావు గారు హిందీ ట్యూషన్స్‌ చెప్తూ ప్రైవేటుగా దక్షిణ భారత హిందీ వారు నిర్వహించే పరీక్షలకు బోధించేవారు. నా ఆసక్తిని గమనించిన ఆయన నాకూ ఆ క్లాసులు బోధించారు. వారి ఆధ్వర్యంలో విశారద పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. ఆయనే మా నాన్నను ఒప్పించి హిందీ టీచర్‌ ట్రైనింగ్‌కి తెనాలి, హిందీ విద్యాలయానికి పంపించారు. అప్పటికి నా వయసు 15 ఏండ్లు మాత్రమే.

ఒకే ఏడాదిలో మూడు కోర్సులు
హిందీ ప్రైమరీ టీచింగ్‌ కోర్సు చేస్తూ అదే ఏడాది రాష్ట్ర భాషా ప్రవీణ, తెలుగు విశారద పండిట్‌ కోర్స్‌, టీచర్‌ ట్రైనింగ్‌ ఒకే ఏడాదిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాను. అప్పటినుండే ఆ విద్యాలయానికి వచ్చే విద్యార్థులకు హిందీ ప్రాథమిక, మధ్యమిక తరగతులకు స్వయంగా బోధించే దాన్ని. మా ప్రిన్సిపాల్‌ బోయపాటి నాగేశ్వరరావు గారు హిందీ ప్రచార ట్రైనింగ్‌ కూడా చేయించాలని మా నాన్నగారికి నచ్చ జెప్పారు. అయితే ఆయన ‘హాస్టల్‌ ఫీజు నేను కట్టను’ అని కచ్చితంగా చెప్పారు. ‘సరే! అయితే మీ అమ్మాయిని నేను చదివిస్తాను’ అని కాలేజీ ప్రిన్సిపాల్‌, కాలేజీలో క్లాసులు చెప్పినందుకు 100 రూపాయలు జీతం ఇచ్చారు. అప్పుడు మా హాస్టల్‌, భోజన వసతుల ఖర్చు రూ.80 ఉండేది. మిగిలిన డబ్బుతో మేమంతా కలిసి నెలకి రెండు సినిమాలు చూస్తూ సరదాగా గడుపుతూ చదువుకున్నాం.

ఇంటికి లాక్కొచ్చినా…
ఎప్పుడూ చదువులో ఫస్ట్‌ నేనే. హాస్టల్లో ఏం జరిగినా నేనే ముందుండి నడిపించే దాన్ని. వ్యాసరచనలో, వక్తగా పోటీల్లో పాల్గొని కలెక్టర్‌ చేతుల మీదుగా వెయ్యి రూపాయల పుస్తకాలను బహుమతిగా అందుకున్నాను. అలా రెండేండ్లు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోయింది. ‘మీ అమ్మాయిని కాలేజీలో నేను చేరుస్తాను, ఇక్కడే ఉంచండి’ అని మా ప్రిన్సిపల్‌ చెబుతున్నా వినకుండా మా నాన్న నన్ను ఇంటికి లాక్కొచ్చేసారు. బయటికి కదలనీరు, ఎవరితో మాట్లాడనీయరు. అయినా నాన్నకు తెలియకుండా అమ్మ ప్రోద్బలంతో టైప్‌ ఇనిస్టిట్యూట్లో చేరి మూడు భాషలు నేర్చుకున్నాను. సొంతంగా చదివి మెట్రిక్‌ పూర్తి చేశాను.

ఆ తర్వాత సాహిత్య రత్న కూడా స్వయంగా చదువుకొని పరీక్షలకు కట్టాను. దీనికంతా కారణం మా గురువుగారి ప్రోత్సాహమే. భాషపై పట్టు రావడానికి కారణం కూడా ఆయనే. ఇక ఐదవ తరగతి నుండే నాకు సాహిత్యం పట్ల వెర్రి అభిమానం. రోజుకి రెండు మూడు పుస్తకాలు అలవోకగా చదివేసేదాన్ని. తెనాలి హిందీ విద్యాలయంలో ఉన్నప్పుడు అక్కడి లైబ్రరీలో ఉన్న ప్రేమ్‌చంద్‌, మహాదేవి వర్మ, సుభద్ర కుమారి చౌహన్‌ వంటి వారి రచనలన్నీ చదివేదాన్ని. సమయం వృధా చేసే అలవాటు నాకు లేదు. అయితే ‘వివాహం విద్య నాశాయ’ ఈ నానుడి నాకు సరిగ్గా సరిపోయింది. అంతే చదువుకు ఫుల్‌స్టాప్‌ పడిపోయింది.

అధ్యాపకురాలిగా…
మా పిల్లలకు హోమియో మందు కోసం గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్లేదాన్ని. వారే ఒక రోజు ‘మీరు సాహిత్య రత్న చదివారు కదా, పార్ట్‌ టైం హిందీ లెక్చరర్‌గా మా కాలేజీలో ఖాళీ ఉంది. వచ్చి చేరిపొండి’ అని హామీ ఇచ్చారు. అలా మా ఊరి కాలేజీలో పార్ట్‌ టైమ్‌ హిందీ లెక్చరర్‌గా ఐదేండ్లు చేసాను. కాలేజీలో ఫిజిక్స్‌ మేడం అంతర్వేది గారు ‘మీరు చదివింది సాహిత్య రత్న ఎం.ఏ.ఈక్వల్‌, అసలు ఎం.ఏ. హిందీ చేయొచ్చు కదా!’ అంటూ ప్రోత్సహించారు. ఇంటికొచ్చి చెబితే ‘ముగ్గురు పిల్లలతో ఎం.ఎ. ఎలా చేస్తావో చూస్తాను’ అంటూ సవాలు విసిరారు మా శ్రీవారు. మైసూర్‌ యూనివర్సిటీ దూరవిద్యకి అప్లై చేసి హిందీ ఎం.ఏ. కూడా ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించాను. నాకు బాల్యం నుండే కబీర్‌ దాస్‌ అంటే అభిమానం. ఆయన చెప్పిన ప్రతి మాటా మనసులో అలా ఉండిపో యేది. సమాజంలో ఏకత్వ భావన తీసుకురావాలన్న సిద్ధాంతం నాకెంతో ఇష్టం.

బుద్ధ సాహిత్య పరిచయంతో…
నిరాశా నిస్పృహలతో గడుపుతున్న నాకు ప్రియ మిత్రులు హరిప్రసాద రావు పరిచయమయ్యారు. ఆయన టి.ఎం.సిలో వైజ్ఞానిక శాస్త్రవేత్తగా ఉద్యోగం చేసేవారు. బౌద్ధ సాహిత్యం ఇచ్చి చదివించేవారు. అవి చదివిన తర్వాత తెలియని ప్రశాంతత లభించింది. ఖాళీగా ఉండకుండా హిందీ వ్యాసాలను తెలుగులోకి అనువదించాను. అంబేద్కర్‌ వ్యాసాలను హిందీ నుంచి తెలుగులోకి అనువదించాను. బుద్ధుని ధర్మానికి సంబంధించిన వ్యాసాల రచనలు చేస్తున్నాను. చరవాణిని ఉపయోగించడం రాని నాకు నా కూతురి కూతురు తన మొదటి జీతంతో స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చింది. పడుతూ లేస్తూ జీవిత సాగరంలో 76 ఏండ్లు పూర్తి చేసుకున్నాను. పదేండ్ల నుండి వాట్సాప్‌ సమూహాలతో పరిచయం సాహిత్యాభిలాషను అభివృద్ధి చేస్తూ వచ్చింది.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -