సంగీతం అంటే గాత్రం లేదా ఏదైనా వాయిద్యం వాయించుట మాత్రమే కాదు మరెన్నో విశేషాలు అనుసంధానమై ఉన్నాయి. ” గీతం వాద్యం చ నత్యం త్రయం సంగీతముచ్యతే” అని 2వ శతాబ్దపు భరతుని నాట్యశాస్త్రం తెలిపినది. అనగా, గీతములు, వాద్యములు, నత్యాల కలయికను సంగీతం అంటారు. కాలాంతరాన గీత వాద్యములు సంగీతమని, నత్యము వేరే అంశముగా విభజించబడినది కనుక సంగీత నత్యాలు రెండూ విడి విడి పాఠ్యాంశాలుగా పరిగణింపబడుతున్నవి. అయినప్పటికీ సంగీత నత్యాలు ఒకదానితో మరొకటిని విడదీయరాని అంశములే.
భరతుడు తన నాట్యశాస్త్రంలో సంగీతం గురించి ఎన్నెన్నో విలువైన నిగూఢ విషయాలను సంస్కత శ్లోకాల రూపేణ గ్రంథీకరించినా అప్పటి దేశ కాల పరిస్థితులలో అంతగా విస్తరించలేదు సరికదా విస్తరింపజేసే ప్రయత్నమూ ఎవరూ చేయలేదనే చెప్పవచ్చు. పైగా 2వ శతాబ్దం నుండి సుమారు 15వ శతాబ్దం వరకు అసలు సంగీతమంటే ఏమిటి? గీతములను ఎట్లు ఆలపించవలెను? వాయిద్యాలు ఎట్లు వాయించవలెను? సంగీతం అభ్యసించుటకు గల పద్ధతి ఏమి? వంటి అంశాలపై అప్పటి సంగీత శాస్త్ర పరిశోధకులు దష్టి సారించినారు. ఈ ప్రశ్నలకు, పరిశోధనలకు ఆ కాలంలో ఉన్న ఒకేఒక సంస్కత సూచనా గ్రంథం భరతుని నాట్యశాస్త్రమే. 13వ శతాబ్దంలో శార్జ్గదేవుడు అనే మహానుభావుడు తన ‘సంగీత రత్నాకరం’లో నాట్యశాస్త్రంలో భరతుడు రాసిన అంశాలను సులభతరం చేసి అందులో శంకలన్నీ తీర్చి సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు దోహదపడినాడు.
ఒక వైపు సంగీత శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, భక్తి సాహిత్య రచనలు కూడా మరికొందరు చేసెడివారు. ఉదాహరణకు 12వ శతాబ్దపు వాగ్గేయకారుడు జయదేవుడు సంస్కతంలో రాధాకష్ణులపై నాయికా నాయక భావముతో అష్టపదులు రచించినాడు. వీరు ఒరిస్సా ప్రాంతానికి చెందినవారు. ఇక తెలుగు వాగ్గేయకారులలో ప్రథమ శ్రేణిలో పేర్కొనదగినవాడు 14వ శతాబ్దంలో జన్మించి తెలుగు పదకవితా పితామహుడు అన్న బిరుదాంకితుడు అన్నమయ్య. తిరుమల వేంకటేశునిపై అత్యంత ప్రేమానురాగాలు కలిగి 32000 పైచిలుకు సంకీర్తనలను రచించిన వాగ్గేయకారుడు. 16వ శతాబ్దానికి చెందిన భద్రాచల రామదాసు వందకు పైగా కీర్తనలు రాముని కీర్తిస్తూ రచించినాడు. తూము నరసింహ దాసు, నారాయణ తీర్థులు, క్షేత్రయ్య, మొదలగు వారు భక్తి సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చినారు కాని వారు చేసిన ప్రతీ రచనకు నిర్ధిష్టమైన రాగ తాళాలను నియమించినారో లేదో కూడా ప్రస్తుత సంగీతజ్ఞులకు అంతుచిక్కని విషయం.
కేవలం తాళ పత్రాల పైన వారు రచించిన సాహిత్యం మాత్రమే లభ్యమైనది కనుక ప్రస్తుత సంగీతజ్ఞులు ఆ సాహిత్యాన్ని బట్టి ఆయా రచనకు సరిపోయే ఆయా రాగ తాళాలు శోధించి, స్వరపరచి ఇప్పుడు అందరూ సులభంగా గానం చేసేటట్టు, వాయిద్యాలపై వాయించేటట్టు సౌలభ్య పరిచినారు. వీటినే పలువురు కలిసి బంద గానాలుగా, గోష్ఠిగా ఈనాటి వరకూ పాడుతూనేవున్నారు.
16 వ శతాబ్దపు వాగ్గేయకారుడు, సంగీత పితామహుడనే బిరుదాంకితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడైన శ్రీ పురందర దాసు సంగీతాన్ని అభ్యసించడానికి ఒక ప్రమాణాన్ని క్రమబద్ధీకరించినాడు. గాత్రమైనా వాయిద్యమైనా ఈనాటికీ ఇదే పద్ధతిని అనుసరిస్తూ నేర్పించుట అభ్యసించుట జరుగుతున్నది. ఈ పద్ధతిలో మొట్టమొదట సరళీ వరుసలు, జంట వరుసలు, హెచ్చు – తగ్గు స్థాయి వరుసలు, దాటు వరుసలు, అలంకారాలు, పిళ్ళారి గీతాలు అంశాలను క్షుణ్ణంగా తళానుగుణంగా, త్రికాలానుగుణంగా అభ్యసించవలెను. తరువాత స్వరపల్లవులు, స్వరాజతులు, వర్ణాలు, కీర్తనలు, కతులు, రాగం తానం పల్లవి, కల్పనా ప్రతిభను వెలికితీసి ప్రదర్శించే అవకాశం ఉంటుంది.
18వ శతాబ్దపు వాగ్గేయకారులైన సంగీత త్రిమూర్తులు – త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు మరియు శ్యామ శాస్త్రుల కాలము నుండి రచనా ప్రక్రియలో కొంత మార్పు చోటుచేసుకున్నది. స్వరపరచిన కతి లేదా కీర్తన అచ్చుగుద్దినట్లు కాకుండా తరువాతి తరాల వారు వారి వారి కల్పనాశక్తి ని బట్టి ఆ రచనలకు అదనపు సొబగులద్ది మరింత రసవత్తరంగా గానం చేసేటట్టు/ వాయించేటట్టు అవకాశం ఉండేలా రచించినారు. సంగీత త్రిమూర్తులను ఆదర్శంగా తీసుకుని తరువాతి కాలం వారు అదే రీతిలో రచనలు చేయడం కొనసాగించినారు. ఎందుకు వీరంతా అనాది కాలం నుండి సంగీత సాధనాశోధనలలో నిమగ్నులైనారు అనే ప్రశ్నకు సమాధానం వారివారి ఆత్మానుభూతులే కారణమని అనుకోవచ్చు. ఎంతో మంది సంగీతజ్ఞులు నాదోపాసకులై క్రియా యోగ సిద్ధిని పొందినారు. భక్తి సాహిత్య రచనలు చేసినవారు ఒక ఎత్తైతే రాగాలతో వాతావరణాన్ని ప్రభావితం చేసి వర్షాలు కురిపించటం, నిప్పు వెలిగించటం వంటివి కూడా చేసి సంగీత శక్తిని నిరూపించిన వారూ లేకపోలేదు.
ఇవన్నీ ఒకప్పటి కాలంలో జరిగినవి కానీ ఈ కాలంలో కూడా జరుగుతాయా అన్న సందేహాన్ని నివారించుటకు 1999 సంవత్సరంలో జరిగిన సంఘటనను ప్రస్తావించాలి. 1998 – 1999 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం విపరీతమైన నీటి కరువును చవిచూసింది. 1999వ సంవత్సరంలో గుంటూరు జిల్లాకు చెందిన సంగీత విద్వాంసుడు శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు వారం రోజుల పాటు హరప్రియ రాగ యజ్ఞాన్ని నిర్వహించి ఆ కరువు ప్రాంతంలో కుండపోత వర్షాలకు కురిపించినాడు. ఈ అద్భుతమైన ఘటన అప్పటి పత్రికలలో వార్తలలో ప్రసారమై, యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యానందాలలో ముంచెత్తింది. వైదిక యజ్ఞాలతో సమానమైనవి సంగీత యజ్ఞాలు అని స్పష్టంగా నిరూపించబడినది. మంత్ర శక్తి ఎంత ప్రభావిత పరుస్తున్నదో, స్వరాలు కూడా అంతే గొప్పగా చేతానాచేతనలను ప్రభావిత పరుస్తాయి. ఈ ప్రభావం మన చుట్టూ పర్యావరణముకే పరిమితం కాక మానవుల మానసిక శారీరక ఆరోగ్యం పై కూడా ఉన్నదని పూర్వ సంగీతజ్ఞుల ద్వారా అనేక పరిశోధనా పత్రాల ద్వారా రుజువైనది.
కొన్ని రాగాలను వినుటచే కొన్ని శరీర రుగ్మతలను నయం చేయగలవని కూడా పరిశోధనలలో తేటతెల్లమైనది. ఉదాహరణకు పంతువరాళి రాగం ఆమ్లత్వ చికిత్సలో, భాగ్యశ్రీ రాగం మధుమేహాన్ని తగ్గించుటలో, దర్బార్ రాగం ఒత్తిడి వల్ల కలిగే ఉద్రిక్తతను తగ్గించుటలో, తోడి రాగం అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించుటలో, హిందోళం తక్కువ రక్తపోటు స్థాయిలను నియంత్రించుటలో, భైరవి రాగం జలుబును తగ్గించుటలో, ఇట్లా పలు రాగాలు పలు రోగాలను నిర్మూలించుటలో దోహద పడుతాయి. కేవలం పాటలను లేదా రాగాలను విని శరీరంలోని రుగ్మతలను ఎట్లా తొలగించుకోగలం అంటే, ఒక రాగం కొన్ని స్వరాలను దానిలో కలిగియుండును. అందులో ఒక్కో స్వరం ఒక్కో వేపన సంఖ్య (షyషశ్రీవర జూవతీ రవషశీఅస) ను సూచిస్తుంది. ఒక్కో స్వరము తరంగాల రూపంలో ప్రయాణించి గాలిలో ఉండే వాయు కణాలను ప్రకంపనలచే స్పందింపజేస్తుంది.
తద్వారా విడుదలైన స్వరములు పర్యావరణ శుద్ధిని గావిస్తాయి. సమస్త జీవుల మానసిక శారీరక ఆరోగ్యంపై చుట్టూ ఉండే ప్రకతి యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుందని, పరిసరాలు నిర్మలంగా ఉంటేనే మానవులు సాత్విక స్వభావులైయుందురని తద్వారా పరిశుద్ధమైన మనసు మరియు శారీరక పుష్టికి హేతువైతాయని పెద్దల మాట. అంతేగాక ప్రత్యక్షంగా మానవుల మెదడులో సాంకేతిక సంజ్ఞలు సానుకూలంగా విడుదలవ్వటానికి స్వర తరంగాలు తోడ్పడుతాయి. ఈ స్వర తరంగాలు శతి శుభగంగా అనేక సార్లు సంగీతజ్ఞులచే ప్రకతి లోకి సజిస్తే నాదోత్పత్తి జరుగుతుంది. ఇది ఒక ధ్యాన యోగ క్రియా. ఈ నాదముపై దష్టి సారించి, గంటల తరబడి అదే ధ్యానంలో ఉండుటయే నాదోపాసన’. దీని వలన శరీరంలోని జ్ఞానేంద్రియాలు ఉత్తేజితమవుతాయి. ఇక తాళం అనే ప్రక్రియ సంగీతానికి ఒక నిబద్ధతను చేకూర్చుతుంది. తత్వపరంగా కాలానికి లయము ఎట్లయితే తప్పనిసరిగా ఉంటుందో, అట్లానే సహజంగా ఆరంభమైనవి అంతమవ్వక తప్పదు. అంటే ఈ విశ్వమంతా కాల నిబద్ధత కలిగి ఉంటుంది.
కాల నిబద్ధత లేనిది, శాశ్వత ఆనందాన్నిచ్చేది కైవల్యము మాత్రమే. అదే విధంగా అనంతమైన సంగీతం లో ‘ తత్ హరి ఓం ‘ (కాలక్రమేనా త ద రి నా అని రూపాంతరం చెందినది) అంటూ సాగే రాగాలాపన మరియు ‘ అనంతా అనంతా ‘ (కాలక్రమేనా తానం తానం అని రూపాంతరం చెందినది) అంటూ సాగే తానం అనే అంశాలకు తప్ప సర్వత్రా కాల నిబద్ధత తప్పనిసరిగా ఉంటుంది. ఈ కాల నిబద్ధత ను కొలిచే ఒక ప్రామాణికమును తాళం అను అందురు. ప్రతీ స్వరమును దాని యొక్క స్వర స్థానంలోనే పాడవలెను లేదా వాయించవలెను. ఎటువంటి మనోధర్మ కల్పన చేసినా స్వర రాగ నియమాలు వీడకుండా తళానుగుణంగా చేయవలెను. అప్పుడే సహజసిద్ధమైన సంగీతోత్పత్తి జరిగి శ్రోతలను రంజింపజేస్తుంది. కళాకారులకు కూడా చెప్పలేని ఆత్మానందాన్నిస్తుంది, సర్వ ప్రాణుల జీవనాడులను చైతన్యపరుస్తుంది. అందుకే సంగీతాభ్యాసం చేసిన వారి మెదడు ఇతరుల కంటే చురుకుగా పనిచేస్తుందని అనేక పరిశోధనలలో తేటతెల్లమైనది. మనిషికీ మనిషికీ మధ్య బాంధవ్యాన్ని ఏర్పరిచేది సంభాషణలైతే , మనసుకీ మనసుకీ మధ్య బాంధవ్యాన్ని ఏర్పరిచేది సంగీతం.
”Where words fail, music speaks” అని అన్నారు డెన్మార్క్ కి చెందిన ఒక గొప్ప రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్. ఇది కళాకారుల సభా ప్రదర్శనల వల్ల కచ్చితంగా సాధ్యపడుతుంది. కనుక ప్రదర్శనలు ప్రేక్షకుల మనసులను కదిలించి ఆహ్లాదపరిచే ఉద్దేశ్యంతో జరగాలి. భారతీయ శాస్త్రీయ సంగీతంపై విదేశాలలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరుగుతుండడం గమనార్హం. సంగీతం కేవలం వీనులవిందు కు మాత్రమే కాక సకల జీవులకు ఆరోగ్య ప్రదాయకం. స్వర సంకేతాలచే సానుకూల ప్రకంపనల ద్వారా మన చుట్టూ ఉన్న పర్యావరణానికి ఒక పవిత్రతను చేకూర్చటానికి, తద్వారా నిష్కల్మషమైన జీవశైలికి సంగీతం నిస్సందేహంగా కారణభూతమవుతుంది. సంగీత విద్యాభివద్ధి పరోక్షంగా సాహిత్యాభివద్ధికీ దారి తీస్తుంది. సంగీత సాహిత్యాలు ఒకదానికొకటి కూలంకషంగా అనుసంధానమైయున్నవే. కావున పిన్నా పెద్దలు ఎటువంటి సంకోచం లేకుండా మంచి గురువుల వద్ద ఎంతోకొంత సంగీతాభ్యాసం చేసి , కుదిరితే లోతైన కీలక అంశాలపై పరిశోధనలు జరిపి సంగీత శాస్త్రాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నించవలెను.
- డా. మారంరాజు వేంకట మానస



