సమాజంలో చైతన్యం నింపేందుకై, పుస్తకాల రూపంలోమెరిసిన తొలి కిరణం గ్రంథాలయం. అయ్యంకి వేసిన ఆ తొలి అడుగు, గాడిచర్ల నడిపిన ఆ చైతన్య రథం, ఊరూరా నిలిపిన అక్షర భాండాగారం. కొమర్రాజు వెలిగించిన తెలుగుమమకారం, భాషా నిలయాలు, విజ్ఞాన చంద్రికలు, చరిత్ర చెప్పిన తొలి పలుకులు. పుస్తకమే ఆయుధంమై, పఠనమే పోరాటంమై, అక్షరమే స్వాతంత్ర పోరాటానికై బాటవేసి జాతీయ భావంతో సామాజిక న్యాయం కోసం, ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది.
ప్రజలలో భయాన్ని పారదోలి అధ్యయనం కోసం పుట్టిన ఈ మహోద్యమం భారతదేశ భవితకు పుస్తకాల పరిమళమై గుండె నిండా, చదువుల సందడిగ మారి, బడి పిల్లలకు, పెద్దలకు, జ్ఞానాన్ని అందించిన అద్వితీయమైన పుస్తకాల భాండాగారం. ఇది పాత పుస్తకాలపై ప్రేమను పెంచి కొత్త టెక్నాలజీతోనూ చేతులు కలిపే మార్గం. డిజిటల్ యుగంలోనూ దేదీప్యమానం, జ్ఞానానికి వారధి ఈ గ్రంథాలయం. నిరంతరం చదువుదాం, నిత్యం నేర్చుకుందాం, గ్రంథాలయాన్ని గుడిలా పూజించుకుందాం. వారోత్సవ స్ఫూర్తిని నిత్యం నిలుపుకుందాం. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల నిల్వగూడు కాదు. అది విద్యా, సాహిత్య, సంస్కృతి, విజ్ఞానాలకు కేంద్రబిందువుగా పనిచేస్తుంది. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు పాఠకులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
ఇంటర్నెట్, సోషల్ మీడియా వేగంగా అభివద్ధి చెందినప్పటికీ గ్రంథాలయాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే పుస్తకాలు ఇస్తున్న లోతైన జ్ఞానం, విశ్లేషణా శక్తి, ఆలోచనా సంపత్తి అమూల్యం. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి నవంబర్ 21 వరకు భారతదేశంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. పుస్తకాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, చదవడం అలవాటు పెంపొందించడం ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం. జ్ఞానం మనిషిని సంపూర్ణుడిగా మార్చే శక్తి. ఆ జ్ఞానానికి నిలయమే గ్రంథాలయం. అదే ఈ వారోత్సవాల ద్వారా మరింత ప్రజల్లోకి చేరుతుంది. భారత దేశ చరిత్రలో గ్రంథాలయాలు విద్య, జ్ఞానం, ప్రజల్లో చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా స్వతంత్ర పోరాట కాలంలో గ్రంథాలయాలు జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో నాటడంలో ఒక శక్తివంతమైన వేదికగా నిలిచాయి.
బ్రిటిష్ పాలన కాలంలో భారతీయులు విద్య, జ్ఞానం, సాహిత్యం ద్వారా స్వాతంత్య్ర భావాలను బలపరిచే ప్రయత్నం చేశారు. విదేశీ పాలకుల అన్యాయాలను ప్రజలకు తెలియజేయడానికి, దేశభక్తి, జాతీయతను వ్యాప్తి చేయడానికి పుస్తకాలు, పత్రికలు, సమావేశాలు ముఖ్య సాధనాలయ్యాయి. ఈ క్రమంలో ప్రజల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.1900 దశకం ప్రారంభంలోనే బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడులో గ్రంథాలయ ఉద్యమానికి ఊతమిచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత దేశంలోని అనేక ప్రాంతాలకు ఈ ఉద్యమం విస్తరించింది. తెలుగునాట గ్రంథాలయ ఉద్యమాలకు ఒక విశిష్ట చరిత్ర ఉంది. ప్రజల్లో చదవాలనే తపన, అవగాహన పెంపు, సంస్కరణాత్మక భావజాలం ప్రచారం కోసం గ్రంథాలయాలు ప్రధాన వేదికలుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాల్లో ఈ ఉద్యమం సామాజిక, విద్యా, రాజకీయ రంగాల్లో ప్రభావవంతంగా సాగింది. 19వ శతాబ్దం చివరలో ప్రబోధోద్యమాలు, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, జాతీయ స్వాతంత్య్ర ఉద్యమాలు ప్రజల్లో జ్ఞానోదయాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రజలలో చదువుపై ఆసక్తి పెరిగి, పుస్తకాల విస్తరణ కోసం గ్రంథాలయాల అవసరం స్పష్టమైంది.
తెలంగాణా ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యమం స్వతంత్ర పోరాటం, ముఖ్యంగా నిజాం వ్యతిరేక పోరాటంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది.తెలంగాణాలో పాఠశాల విద్య అభివృద్ధి కష్టతరం అయిన కాలంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం (1918) స్థాపనతో ఉన్నతవిద్య విస్తరించింది. ఈ విజ్ఞాన వాతావరణంలో గ్రంథాలయాల ఆవశ్యకత పెరిగింది. నిజాం దోపిడీ పాలన, ఉర్దూ భాష ఆధిపత్యం ఉన్న సందర్భాలలో ప్రజల్లో జ్ఞానోదయం, స్వేచ్ఛాభావాల వ్యాప్తికి గ్రంథాలయాలు రహస్య కేంద్రాలుగా పనిచేశాయి. భారతదేశ చరిత్ర, దేశభక్తి కథలు, విప్లవ రచనలు ప్రజల్లో చైతన్యం పెంపొందించాయి. స్వరాజ్య అనే భావనను ప్రజలలో బలంగా నింపాయి. గ్రంథాలయాలు స్వాతంత్య్ర ఉద్యమానికి సమాచార కేంద్రాలుగా పనిచేశాయి. పత్రికలు, పాంప్లెట్లు, ప్రసంగాల ద్వారా ప్రజలు ఉద్యమ కార్యక్రమాలను తెలుసుకుని వాటిలో పాల్గొన్నారు.
అక్షరాస్యత పెంపు ద్వారా ప్రజలను జాగతం చేయడంలో గ్రంథాలయాలు కీలకంగా మారాయి. ప్రజల్లో ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందించాయి. మహాత్మా గాంధీ, బాల గంగాధర తిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతల రచనలు గ్రంథాలయాల ద్వారా ప్రజలకు చేరాయి. వీటిలోని ఆలోచనలు స్వాతంత్ర భావజాలానికి బీజం వేశాయి. అనేక గ్రంథాలయాలు సమావేశ కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించింది. భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమం కేవలం పుస్తకాలు సేకరించి భద్రపరచడం కోసం కాకుండా, ప్రజలలో అక్షరాస్యతను, చైతన్యాన్ని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన సామాజిక-సాంస్కతిక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించింది, ఎందుకంటే గ్రంథాలయాల ద్వారానే మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకుల సందేశాలు సామాన్య ప్రజలకు చేరాయి.
అయ్యంకి వెంకటరమణయ్య (గ్రంథాలయోద్యమ పితామహుడు). ఆంధ్రదేశంలో గ్రంథాలయోద్యమానికి రూపశిల్పిగా, పితామహుడిగా పేరుగాంచారు. 1911లో రామమోహన గ్రంథాలయాన్ని స్థాపించారు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో తొలి గ్రంథాలయ మహాసభను నిర్వహించారు. 1915లో భారతదేశంలోని తొలి గ్రంథాలయ సంఘాన్ని (ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం) ఏర్పాటు చేశారు. ఈ సంఘం తరఫున ‘ఇండియన్ లైబ్రరీ జర్నల్’ను ప్రారంభించారు. ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంలో, గ్రంథాలయ యాత్రల నిర్వహణలో ఈయన కషి అపారమైనది.గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమ నాయకులలో మరొక ముఖ్యులు. ఈయన ‘గ్రంథాలయ సర్వస్వము’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఇది గ్రంథాలయోద్యమానికి అధికార పత్రికగా నిలిచింది. ప్రజా గ్రంథాలయాల వ్యాప్తికి, వయోజన విద్యకు విశేషంగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో గ్రంథాలయ ఉద్యమం అత్యంత చురుకుగా సాగింది.
ప్రత్యేకించి నిజాం పాలనలో తెలుగు భాషకు, సంస్కతికి తగిన ఆదరణ లేని తెలంగాణ ప్రాంతంలో, ఈ ఉద్యమం కేవలం విద్యా వ్యాప్తికి మాత్రమే కాకుండా భాషా సంస్కతి పునరుజ్జీవానికి, రాజకీయ చైతన్యానికి తొలి మెట్టుగా నిలిచింది. కొమర్రాజు లక్ష్మణరావు తెలంగాణ గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు, పితామహుడిగా ఈయనను పేర్కొంటారు. 1906లో రావి రంగారావుతో కలిసి విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించారు. ఈ మండలి చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాలపై అనేక పుస్తకాలు ప్రచురించి ఆధునిక భాషా వ్యాప్తికి కృషి చేసింది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం (1901) ఏర్పాటులో కూడా పరోక్షంగా ఆయన కృషి ఉంది.రావి రంగారావు విజ్ఞాన చంద్రికా మండలి ఏర్పాటులో కొమర్రాజు లక్ష్మణరావుకు సహకరించారు. 1901లో హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనలో కీలక భూమిక వహించారు. ఈ గ్రంథాలయం నిజాం పరిపాలనలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒక మైలురాయిగా నిలిచింది. మాడపాటి హనుమంతరావు ఆంధ్రజన సంఘం నాయకుడిగా, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి గ్రంథాలయ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు.
నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం ద్వారా గ్రంథాలయాల ఏర్పాటుకు, తెలుగు భాషా వికాసానికి కృషి చేశారు. కోదాటి నారాయణరావు తెలంగాణ గ్రంథాలయోద్యమంలో చురుకుగా పాల్గొన్న ప్రముఖులలో ఒకరు. తన స్వీయచరిత్ర ‘నారాయణ త్రయం’లో తెలంగాణ గ్రంథాలయోద్యమానికి సంబంధించిన అనేక అంశాలను పేర్కొన్నారు. ఈ నాయకులందరూ గ్రంథాలయాన్ని కేవలం పఠన మందిరంగా కాక, ప్రజల మేధో కేంద్రంగా, సామాజిక-రాజకీయ చైతన్య కేంద్రంగా మార్చారు. నిజాం రాష్ట్రంలో నిరంకుశ పాలనలో, గ్రంథాలయాలు ఒక రకంగా ప్రజాస్వామ్య సాధనకు, తెలుగు భాషా పరిరక్షణకు, స్వాతంత్య్రోద్యమానికి వేదికలుగా నిలిచాయి. వారి నిస్వార్థ సేవ, దూరదృష్టి కారణంగానే ఈ ప్రాంతాలలో అక్షర జ్ఞానం వ్యాపించి, అనేక సామాజిక ఉద్యమాలకు పునాది పడింది. జాతీయ చైతన్యం పెరిగింది. అక్షరాస్యత, విద్య విస్తరించింది. దేశభక్తి భావాలు బలపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛ ఉద్యమంలో పాల్గొన్నారు. కొత్త ఆలోచనలు, సంస్కరణలు వ్యాప్తి చెందాయి. స్వాతంత్య్ర సంగ్రామానికి బలమైన మౌలిక వేదికగా మారాయి.
భారత స్వాతంత్య్ర పోరాటంలో గ్రంథాలయాలు అమూల్యమైన సేవలు అందించాయి. ప్రజలను చదవడం, ఆలోచించడం, ప్రశ్నించడం వైపు మళ్లించాయి. జాతీయత, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను ప్రజల్లో నింపాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమ విజయానికి గ్రంథాలయాలు మౌన సైనికుల్లా పని చేశాయి అని చెప్పడం అతిశయోక్తికాదు. ఈ గ్రంథాలయాల వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ గ్రంథాలయాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించి. పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు, వ్యాస రచన కార్యక్రమాలు, సాహితీ సదస్సులు, రచయితలతో సంభాషణ కార్యక్రమాలు వంటివి నిర్వహించి విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంచవలసిన ఆవశ్యకత ఉంది. పుస్తకాలు మనలో ఉన్న అనేక సందేహాలను తీర్చడమే కాక మనలో ఆలోచనా శక్తిని, పరిశీలనా దృక్కోణాన్ని పెంచుతాయి. గ్రంథాలయాలు మన సంస్కృతిని, చరిత్రను భద్రపరిచే కేంద్రాలు. పాత పుస్తకాల ద్వారా పూర్వీకుల జ్ఞానం, వారి భావాలు, సంఘటనలు మనకు లభిస్తాయి.
దాంతో మన జాతి పట్ల గౌరవం, బాధ్యత పెరుగుతుంది. ప్రతి విద్యా సంస్థలో గ్రంథాలయం తప్పనిసరి. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మొత్తానికి, ఈ గ్రంథాలయ వారోత్సవాలు పఠన స్ఫూర్తి కలిగించేందుకు, పుస్తకాల ప్రాధాన్యతను ప్రజలకు చాటేందుకు ఒక వేదిక. పుస్తకాలు చదివే అలవాటు పెరుగితే సమాజ అభివద్ధి వేగవంతమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రంథాలయలు. సామాజిక – రాజకీయ నేపథ్యంలో ప్రారంభమైనప్పటికీ, రెండింటి ముఖ్య లక్ష్యం ప్రజల్లో జ్ఞానం, చైతన్యం, విద్యాభివృద్ధిని పెంచడం. గ్రంథాలయ ఉద్యమాలు స్వాతంత్య్రోద్యమాలకు, విద్యావ్యాప్తికి, సంస్కరణోద్యమాలకు బలమైన పునాది వేశాయి. అందుకే గ్రంథాలయాలు జ్ఞానమార్గదర్శకాలు, సామాజిక చైతన్య కేంద్రాలుగా నిలుస్తున్నాయి.
(నవంబర్ 14 నుండి 21 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు)
డా||పూసపాటి వేదాద్రి
9912197694



