రాయల్స్ గూటికి రవీంద్ర జడేజా
సూపర్‌కింగ్స్‌కు ఆడనున్న సంజు శాంసన్
ఐపీఎల్ 2026 ఆటగాళ్ల ట్రేడింగ్
నవతెలంగాణ-ముంబయి
చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ఆటగాడు, 12 సీజన్లు ఆ ప్రాంఛైజీ తరఫున ఆడిన రవీంద్ర జడేజా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొత్త ప్రాంఛైజీ తరఫున ఆడనున్నాడు. ధోనీని ‘తల’ అని పిలుచుకునే సూపర్‌కింగ్స్ అభిమానులు.. రవీంద్ర జడేజాను ‘తలపతి’ అంటూ తమవాడిగా భావించారు. భావోద్వేగాలను పక్కనపెట్టిన సూపర్‌కింగ్స్ యాజమాన్యం రవీంద్ర జడేజాను వదిలేసింది. రూ.18 కోట్లకు గత సీజన్‌కు అట్టిపెట్టుకున్న చెన్నై.. రూ.14 కోట్లకు రాజస్తాన్ రాయల్స్‌కు పంపించింది. ఇదే సమయంలో రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ రూ. 18 కోట్ల ధరకు చెన్నై సూపర్‌కింగ్స్‌కు వచ్చాడు. సూపర్‌కింగ్స్ పేస్ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ రూ.2.40 కోట్ల ధరకు రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లాడు.
సంజు శాంసన్‌ను తన గత సీజన్ ధరకు సూపర్‌కింగ్స్‌కు ఇచ్చిన రాయల్స్.. జడేజాను రూ. 4 కోట్ల తక్కువ ధరకు తీసుకుంది. ముగ్గురు ఆటగాళ్లతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రాంఛైజీలు తెలిపాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ మహ్మద్ షమిని వదులుకుంది. రూ. 10 కోట్ల ధరకు మహ్మద్ షమిని లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. ‘రవీంద్ర జడేజాను వదిలేయటం సూపర్‌కింగ్స్ యాజమాన్యం తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం. సూపర్‌కింగ్స్ విజయాల్లో జడేజాది కీలక పాత్ర. అతడు ఎప్పుడూ సూపర్‌కింగ్స్ కుటుంబంలో ప్రత్యేకమే. టాప్ ఆర్డర్‌లో భారత బ్యాటర్ ఉండాలని అనుకున్నాం. సంజు శాంసన్ సరైన వ్యక్తి అని భావించాం. సూపర్‌కింగ్స్ ఫ్యామిలీలోకి సంజును ఆహ్వానిస్తున్నామని’ సూపర్‌కింగ్స్ ఎండీ కాశీ విశ్వనాథ్ తెలిపారు.
లక్నోకు అర్జున్ టెండూల్కర్
పేస్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ తీసుకుంది. రూ.30 లక్షల ధరకు అర్జున్ టెండూల్కర్‌ను ముంబయి ఇండియన్స్ తీసుకోగా.. అదే ధరకు లక్నో సూపర్‌జెయింట్స్ ట్రేడ్ చేసింది. రాజస్తాన్ రాయల్స్ మరో ఆటగాడిని వదిలేసింది. నితీశ్ రానాను ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్యాష్ డీల్‌కు ఓకే చేసింది. రూ. 4.2 కోట్లకు నితీశ్ రానాను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఆల్‌రౌండర్ డెవాన్ ఫెరీరా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్తాన్ రాయల్స్‌కు వచ్చాడు. రూ. 75 లక్షలకు డెవాన్‌ను క్యాపిటల్స్ తీసుకోగా.. రూ. 1 కోటి ధరకు రాయల్స్ దక్కించుకుంది.
వేలంలో రస్సెల్, మాక్స్‌వెల్, పతిరణ
ఈ ఏడాది మినీ ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగనుంది. పలు ప్రాంఛైజీలు కీలక ఆటగాళ్లను వేలంలోకి వదిలేశాయి. 2014 నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్‌ను ఆ ప్రాంఛైజీ వదులుకుంది. గత ఏడాది వేలంలో రికార్డు ధరకు వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకున్న కోల్‌కతా… అతడికి వేలంలోకి విడుదల చేసింది. శ్రీలంక పేసర్ మతీశ పతిరణను సూపర్‌కింగ్స్ వదిలేయటం ఆశ్చర్యపరిచింది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే సహా విజరు శంకర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్‌లను సూపర్‌కింగ్స్ వదులుకుంది.



