హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి
నిలిచిన ఆర్థిక సంఘం నిధులు
‘ప్రత్యేక’ పాలనలో ప్రజల పాట్ల
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నెలకొన్న సందిగ్ధతకు ఇకనైనా తెరపడుతుందా? లేక అలాగే కొనసా గుతుందా? అనేది రెండు, మూడు రోజుల్లో తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధపడగా అందుకు హైకోర్టు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రక్రియకు ముందడుగు పడలేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగానే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 17నాటి రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం తీసుకునే నిర్ణయం.. 24న హైకోర్టు వెలువరించే తీర్పు కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిలిచిన నిధుల విడుదల..
పంచాయతీలకు పాలకవర్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి దాదాపు ఏడాదిన్నరైంది. అలాగే,మండల, జి ల్లా పరిషత్ పాలకవర్గాలు, మున్సి పల్ కౌన్సిల్ గడువు ముగిసి ఏడాది దాటింది. ప్రస్తుతం వీటన్నింట్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం (ఎఫ్ ఎఫ్సీ), రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) నిధుల విడుదల పూర్తిగా నిలిచింది. దీంతో స్థానిక వనరులపైనే ఆధారపడాల్సివస్తోంది.సరిపడా నిధులు లేక అభివృద్ధి పూర్తిగా నిలిచింది. కొన్ని పంచాయ తీల్లో ట్రాక్టర్ డీజిల్, కిస్తీలు, విద్యుత్ బిల్లులు చెల్లిం చలేని దుస్థితి ఉంది. పారిశుధ్యం, తాగునీటి పనులకు పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.



