స్థూలంగా చూస్తే విరామ చిహ్నాలు సాహిత్య ఉపకరణాల కిందికే వస్తాయి. కానీ, అవి ఒక విధంగా చాలా చిన్నవి కనుక, వాటిని అలా పేర్కొనరు. ఇతర విరామ చిహ్నాలు తెలిసినవే అయినా, అడ్డగీత (dash), మూడు చుక్కలు (ellipsis) మాత్రం చాలా మందికి అసంపూర్ణంగా తెలిసిన అంశాలు. అడ్డగీతను యోజక చిహ్నం అని కూడా అంటున్నారు. వీటికన్న పెద్దవి అయిన విరామ సూచక ఉపకరణాలలో సీజూరా (caesura) ఆసక్తికరమైనది కాబట్టి, ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం.
సీజూరా, కవితా పంక్తిలో గానీ వాక్యంలో గానీ విరామాన్ని సూచిస్తుంది. కామా, డాష్, సెమి కోలన్, కోలన్ మొదలైన విరామ చిహ్నాలుండగా మళ్లీ సీజూరా అనే వేరే సాహిత్య సాధనం ఎందుకు అవసరమైంది? దీనికి సమాధానమేమంటే, విరామ చిహ్నాలు వ్యాకరణానికి సంబంధించినవి. సీజూరానేమో కవిత్వ లయతో సంబంధం కలిగినది. అది వేగాన్ని మాత్రమే కాకుండా భావోద్వేగాన్నీ, ఊనికనూ కూడా నియంత్రిస్తుంది. హామ్లెట్ నాటకంలో షేక్స్పియర్ రాసిన “To be or not to be – that is the question” అనే వాక్యాన్ని సీజూరాకు క్లాసికల్ ఉదాహరణగా చూపిస్తారు విమర్శకులు. ఇక్కడ డాష్ చిహ్నం సీజూరాగా పని చేస్తున్నది. ఈ బ్రేక్‌ను సూచించేందుకు తరచుగా డబుల్ పైప్ (ll) లేదా డబుల్ స్లాష్ (//) ను వాడుతారు. వీటితో పాటు వీటికన్న ముందు విరామ చిహ్నాలను కూడా పెట్టవచ్చు, లేదా పెట్టకపోవచ్చు.
సీజూరాలో ప్రారంభ (initial), మధ్యస్థ (medial), అంత్య(terminal) అనే మూడు రకాలున్నాయి. అదే క్రమంలో ఉదాహరణలు చూడండి.
Dead // is the frozen lake (Lord Tennyson).
Sing a song of sixpence // a pocket full of rye (Nursery rhyme). పైన చెప్పిన షేక్స్పియర్ వాక్యం కూడా ఈ రకం కిందికే వస్తుంది.
Then there’s a pair of us, // don’t tell. (Emily Dickinson) తెలుగు సాహిత్యంలో సీజూరాకు కచ్చితంగా సరిపోయే ఉదాహరణలను చూపించడం అంత సులభం కాదు. అయినా ఈ కిందివాటిని పరిశీలించండి.
రైలు వెళ్లిపోయింది// పొగ మాత్రం ఆగలేదు
అదంతే// ఒడిదొడుకులు ఎదురైనా జీవితం సాగిపోతూనే ఉంటుంది
వల విసిరాను// వాన వెలిసింది (గోపిని కరుణాకర్)
లేపకండి:// అరనిద్రలో వున్నాను (జుగాష్ విలి)
గొంతు నీదైతేనేం – // గొంతును పలికించేది వాడు (వేల్పుల నారాయణ)
వంశీకృష్ణ కవితలోని ఈ కింది ఒక్కో పంక్తిలో ఒక్కో సీజూరా చొప్పున రెండు సీజూరాలున్నాయి, చూడండి.
మరణాలు సరే! // చెట్లు, చేమలు, నదులు, సముద్రాలు
చివరకు మనుషులు, దేవుళ్లు, // ఎవరైనా మరణిస్తారు
కానీ, ఇక్కడ ఒక విషయాన్ని గమనించడం అవసరం. పైన పేర్కొన్న గోపిని కరుణాకర్ పంక్తిని వల విసిరాను
వాన వెలిసింది అని రెండు పంక్తులుగా విభజించి రాస్తే, విసిరాను తర్వాత విరామం వస్తుంది కనుక, అప్పుడది సీజూరా కాదు. పంక్తి లోపల ఉన్న విరామాన్ని సూచించేదాన్ని మాత్రమే సీజూరా అంటారు.
ఇక మూడు చుక్కల (ellipsis) విషయానికి వస్తే, రాయకుండా వదిలిపెట్టిన matter ను గానీ, విరామాన్ని గానీ, అసంపూర్ణ ఊహను గానీ సూచించేందుకు వాటిని/ దాన్ని వాడుతారు. నేనిప్పుడు లైబ్రరీకి పోవచ్చు లేదా … అని రాసి ముగిస్తే, ఆ మూడు చుక్కల స్థానంలో ఏ పదాలైనా ఉండవచ్చు. అంటే, ఉత్కంఠను రేపేందుకు కూడా ఈ ‘త్రిబిందువు’ (ఈ మాట ఈ వ్యాసకర్త సృష్టి!) పనికి వస్తుందన్న మాట. ఇంగ్లిష్ భాషాసంప్రదాయం ప్రకారం ఒకటి, మూడు, లేక నాలుగు చుక్కల వినియోగం మాత్రమే ఉంది. మొదటిదాన్ని వాక్యాంత బిందువు (full stop) కోసం, రెండవదాన్ని వాక్యం మధ్యలో ellipsis కోసం, మూడవదాన్ని వాక్యాంతంలో ఫుల్ స్టాప్ ను కలిపిన ellipsis కోసం వాడుతారు. రెండు చుక్కల పద్ధతి ఆంగ్లంలో లేనే లేదు. కానీ మన తెలుగు కవులు, రచయితలు, పత్రికలవాళ్లు రెండు చుక్కలను వాడుతున్నారు. సరే, పెద్ద రాద్ధాంతం చేయకుండా దాన్ని మన నూతన ఆవిష్క్రియగా భావించవచ్చు.
తెలుగులో మూడు చుక్కలను తప్పుగా వాడటం అప్పుడప్పుడు కనిపిస్తుంది. ‘కవిత్వమంటే నాకు ఎంతో ఇష్టం’ అనే వాక్యంలో చివరి రెండు పదాల మధ్య మూడు చుక్కల అవసరం లేదు. కానీ, కొందరు వాటిని పెడుతున్నారు. భాష విషయంలో నియమాలను కచ్చితంగా పాటించాలనుకునే పరిపూర్ణతా వాదుల (perfectionists) కోసం మాత్రమే ఇదంతా చెప్పడం.
ఇక డాష్ గురించి: హైఫన్ రెండు లేక ఎక్కువ పదాల సంయోజనకర్త కాగా, డాష్ ఒక విరామాన్ని లేదా అదనపు సమాచారాన్ని సూచించే చిహ్నం. డాష్ నిడివి హైఫన్ నిడివికి రెండు రెట్లు. మొదటిది పదాలను కలుపుతుంది, రెండవది వేరు చేస్తుంది. మొదటిదానికి ఇ-మెయిల్, ఆంగ్ల-తెలుగు నిఘంటువు, రెండవదానికి ‘పిల్లల ఆరోగ్యం – జాగ్రత్తలు’ ఉదాహరణలు. డాష్ లో మళ్లీ ఎన్ డాష్, ఎమ్ డాష్ అని రెండు రకాలున్నాయి. వాటి గురించి వివరిస్తూ పోతే కొందరికి విసుగు కలగవచ్చు. ఐతే, ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. హైఫన్‌కు, డాష్‌కు అదే క్రమంలో అడ్డగీత, యోజన చిహ్నం అనే మాటలను వాడుతున్నారు. కానీ మొదటిదానికి యోజన చిహ్నం, రెండవదానికి విభాజక చిహ్నం సరైన మాటలు. పైన ఇచ్చిన వివరణలను పరిశీలిస్తే అంతరం అవగతమౌతుంది. ఇంత సూక్ష్మంగా, నిశితంగా పరిశీలించడం అవసరమా, అని ప్రశ్నిస్తే ఏమని జవాబివ్వగలం? అవసరమనుకుంటే అవసరం, అవసరం కాదనుకుంటే అనవసరం!
- ఎలనాగ



