Monday, November 17, 2025
E-PAPER
Homeఆటలుటర్న్‌కు టప టపా

టర్న్‌కు టప టపా

- Advertisement -

లక్ష్యం 124, భారత్‌ 93 ఆలౌట్‌
సఫారీ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ మాయ

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం

గత ఏడు టెస్టుల్లో ఆరు పరాజయాలు. గత 15 ఏండ్లలో భారత గడ్డపై ఒక్క టెస్టు విజయం సాధించ లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల వెనుకంజ. అయినా, ఈడెన్‌ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా అద్భుతం చేసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఆతిథ్య భారత్‌కు స్పిన్‌ స్ట్రోక్‌ ఇచ్చి.. 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో భారత్‌ 93 పరుగులకే కుప్పకూలింది. రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ముందంజ వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్‌.. 30 పరుగుల తేడాతో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.

నవతెలంగాణ-కోల్‌కతా
ఈడెన్‌గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా అద్భుతం చేసింది. ఆఫ్‌ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ (4/21), లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (2/37), పేసర్‌ మార్కో యాన్సెన్‌ (2/15) మ్యాజిక్‌తో భారత్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. 124 పరుగుల ఛేదనలో భారత్‌ 35 ఓవర్లలో 93 పరుగులకు కుప్పకూలింది. వాషింగ్టన్‌ సుందర్‌ (31, 92 బంతుల్లో 2 ఫోర్లు), అక్షర్‌ పటేల్‌ (26, 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (18, 26 బంతుల్లో 2 ఫోర్లు) మెరిసినా.. భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేదు. అంతకుముందు తెంబ బవుమా (55 నాటౌట్‌, 136 బంతుల్లో 4 ఫోర్లు) వీరోచిత అర్థ సెంచరీతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసింది. టెయిలెండర్‌ కార్బిన్‌ బాచ్‌ (25, 37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. ఎనిమిది వికెట్లతో మాయ చేసిన సైమన్‌ హార్మర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

స్పిన్‌ స్ట్రోక్‌
భారత్‌ లక్ష్యం 124 పరుగులు. సఫారీ శిబిరంలో ఇద్దరే స్పిన్నర్లు. తొలి ఇన్నింగ్స్‌లో కేశవ్‌ మహరాజ్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు. పిచ్‌ బ్యాటింగ్‌కు కఠినంగా మారినా.. మనోళ్లు కొట్టేస్తారనే దీమా. కానీ పేసర్‌ యాన్సెన్‌ కొత్త బంతితో ఓపెనర్లు ఇద్దరినీ సాగనంపి భారత ఆత్మవిశ్వాసం దెబ్బతీశాడు. జైస్వాల్‌ (0), రాహుల్‌ (1) వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించారు. ధ్రువ్‌ జురెల్‌ (13), రిషబ్‌ పంత్‌ (2)లను సైమన్‌ హార్మర్‌ వెనక్కి పంపాడు. 38/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న భారత్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ (31), రవీంద్ర జడేజా (18) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 26 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించింది.

సుందర్‌ క్రీజులో పాతుకుపోగా.. జడేజా స్కోరు బోర్డుకు ముందుకు నడిపించాడు. కానీ జడేజాను హార్మర్‌.. మార్‌క్రామ్‌ మాయకు సుందర్‌ పడిపోయారు. 72/6తో భారత్‌ ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఈ సమయంలో అక్షర్‌ పటేల్‌ (26)పైనే ఆశలు నెలకొన్నాయి. కేశవ్‌ మహరాజ్‌పై ఎదురుదాడి చేసిన అక్షర్‌ పటేల్‌.. ఓ ఫోర్‌, రెండు సిక్సర్లు బాదాదు. అదే ఓవర్లో మరో సిక్సర్‌కు ప్రయత్నించి బవుమాకు క్యాచ్‌ ఇచ్చాడు. సిరాజ్‌ తొలి బంతికే నిష్క్రమించగా 35 ఓవర్లలో భారత్‌ 93 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వీప్‌ షాట్‌ ఆడుతూ మెడ గాయానికి గురైన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఛేదనలో బ్యాటింగ్‌కు రాలేదు. గాయం తీవ్రత దృష్ట్యా గిల్‌ను ఆసుపత్రికి తరలించారు.

బవుమా అజేయ అర్థ సెంచరీ
ఓవర్‌నైట్‌ స్కోరు 93/7తో మూడో రోజు ఉదయం బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా.. అప్పటికి 63 పరుగుల ముందంజలోనే నిలిచింది. చివరి మూడు వికెట్లను త్వరగా పడగొడితే.. భారత్‌ రెండెంకల లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉండేది. కానీ ఉదయం సెషన్‌ను అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌తో మొదలెట్టిన బారత్‌.. రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌లను ప్రయోగించింది. తొలి రెండు రోజులు గొప్పగా మాయ చేసిన స్పిన్నర్లు.. మూడో రోజు తేలిపోయారు. జడేజా 7 ఓవర్లలో 21 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ను టెయిలెండర్‌ కార్బన్‌ బాచ్‌ లక్ష్యంగా చేసుకుని బౌండరీలు బాదాడు. అక్షర్‌ పటేల్‌ ఒత్తిడి పెంచలేకపోయాడు.

ఫలితంగా స్ట్రయిక్‌ రొటేషన్‌తో బవుమా, బాచ్‌లు పరుగులు పిండుకున్నారు. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించింది. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పగా రాణించిన బవుమా.. 4 ఫోర్లతో 122 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. సైమన్‌ హార్మర్‌ (7)తో కలిసి మరో 18 పరుగులు జోడించిన బవుమా.. అర్థ సెంచరీతో అజేయంగా నిలిచాడు. మూడో రోజు ఉదయం సెషన్లో దక్షిణాఫ్రికా మరో 60 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు సవాల్‌తో కూడిన 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముగ్గురు స్పిన్నర్లు వికెట్ల వేటలో నిరాశపరచగా.. పేసర్లు బుమ్రా, సిరాజ్‌కు బంతిని అందించిన రిషబ్‌ పంత్‌ ఎట్టకేలకు లాంఛనం ముగించాడు. 54 ఓవర్లలో దక్షిణాఫ్రికా 153 పరుగులకు ఆలౌటైంది.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 159/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 189/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ : 153/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 93/10

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -