Monday, November 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఏ దేశం పైనా జీ20 ఆధారపడదు

ఏ దేశం పైనా జీ20 ఆధారపడదు

- Advertisement -

ట్రంప్‌ రాకపోయినా యథావిధిగా సమ్మిట్‌ : దక్షిణాఫ్రికా

జోహాన్స్‌బర్గ్‌: ‘జీ20 ఇక ఏ ఒక్క దేశంపై ఆధారపడే వేదిక కాదు. దానికి సొంత శక్తి, సొంత ప్రయోజనం ఏర్పడింది. అమెరికా హాజరు కాకపోయినా, జీ20 ఒక శక్తివంతమైన అంతర్జాతీయ వేదికగానే కొనసాగుతుంది’ అని దక్షి ణాఫ్రికా హైకమిషనర్‌ అనిల్‌ సూక్లాల్‌ పేర్కొన్నారు. 2025 జీ20 జోహాన్స్‌బర్గ్‌ సమ్మిట్‌కు అమెరికా దూరంగా ఉన్నా సమ్మిట్‌ యథావిధిగా జరుగుతుందని సూక్లాల్‌ స్పష్టం చేశారు. 2008 గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌ సమయంలో వాషింగ్టన్‌లో మొదటి జీ20 సమ్మిట్‌ను నిర్వహించడంలో అమెరికా ప్రధాన శక్తిగా వ్యవహరించింది. ఉత్తర-దక్షిణ దేశాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది. ”ఇప్పుడు ఆ దేశం చివరి సమ్మిట్‌కు దూరంగా ఉండటం దురదృష్టకరం” అని సూక్లాల్‌ అన్నారు. అమెరికా లేకున్నా మిగతా జీ20 దేశాలు దక్షిణాఫ్రికా ప్రాధాన్యతలకు బలంగా మద్దతు ఇస్తున్నాయని స్పష్టం చేశారు.

ట్రంప్‌ ఆరోపణలు
జీ20 సమ్మిట్‌ నుంచి అమెరికా దూరంగా ఉంటుందని నవంబర్‌ 7న అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దక్షిణా ఫ్రికాలో ఆఫ్రికన్లపై హింస, భూస్వాధీనం జరుగు తోందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నంత వరకు ఏ అమెరికా ప్రభుత్వ అధికారి కూడా జీ20కి హాజరు కారని ఆయన ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో ట్రంప్‌ 2026 జీ20 సమ్మిట్‌ను అమెరికాలోని మియామిలో నిర్వహిస్తానని కూడా ప్రకటించారు.

వైట్‌ హౌస్‌ ముందే సూచన
ఇప్పటికే ఈ ఏడాది మే నెలలోనే వైట్‌ హౌస్‌ ఫెడరల్‌ ఏజెన్సీలకు దక్షిణాఫ్రికా జీ20 సమ్మిట్‌కు సంబంధించిన అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించినట్టు ది హిల్‌ మీడియా నివేదించింది.
ఆ సమయంలోనే అమెరికా ఈ సమావేశానికి హాజరుకాదని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు, జీ20 సమ్మిట్‌ గ్లోబల్‌ వేదికపై ఆఫ్రికా ఖండ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఇదేనని సూక్లాల్‌ వ్యాఖ్యానించారు. మొదటిసారిగా ఆఫ్రికా దేశం జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తోందని, దక్షిణాఫ్రికా ఒక్కటే ఆఫ్రికా ఖండం నుంచి జీ-20 సభ్యదేశమని ఆయన గుర్తుచేశారు. 2023లో భారత అధ్యక్షతలో ఆఫ్రికన్‌ యూనియన్‌ పూర్తి సభ్యత్వం పొందడం ఈ సదస్సు ప్రాధాన్యాన్ని మరింత పెంచిందన్నారు.

”ఇది కేవలం దక్షిణాఫ్రికా విషయం మాత్రమే కాదు. మొత్తం ఆఫ్రికా ఖండం నాయకత్వ సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించే వేళ. మా నాయకత్వం గ్లోబల్‌ వేదికపై ఎంత దృఢంగా ఉందో ఈ సదస్సు చూపిస్తుంది” అని సూక్లాల్‌ తెలిపారు. దక్షిణాఫ్రికా ఈ ఏడాది సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రపంచం విభజన దిశగా సాగుతున్న వేళ సమానత్వం, పరస్పర సహకారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. పేద దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను దష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రాధాన్యాలు నిర్ణయించామని చెప్పారు. ”అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అసమానత పెరుగుతోంది.

ఇన్‌క్లూజివ్‌ ఎకానమీ, ఉపాధి సృష్టి, పరిశ్రమీకర ఇవన్నీ గ్లోబల్‌ సౌత్‌కు అత్యంత కీలకం” అని వివరించారు. పేద దేశాల్లో ఆహార భద్రత కీలక సమస్యగా మారిందని, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇన్నోవేషన్‌, సస్టైనబిలిటీ, డేటా గవర్నెన్స్‌ వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో రుణభారం పెరుగు తుండటంతో డెట్‌ సస్టైనబిలిటీపై కూడా దేశాలు చర్చించనున్నాయని వెల్లడించారు. ”ఈ అంశాలన్నింటిపై ఇప్పటికే సానుకూల పురోగతి కనిపిస్తోంది. నాయకులు చర్చించిన తర్వాత ముఖ్య అంశాలపై ఏకాభిప్రాయం రావాలని ఆశిస్తున్నాం” అని ఆయన చెప్పారు. ఈ నెలలో దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 లీడర్స్‌ సమ్మిట్‌ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -