సామాజిక వ్యవస్థలో మార్పు జరగాలి : ఐద్వా ఆలిండియా జాయింట్ సెక్రెటరీ తపసీ ప్రహరాజ్
నవతెలంగాణ-కాగజ్‌నగర్
దేశంలో మహిళల భద్రతకు కఠిన చట్టాలు రావాలని, దాంతో పాటు సామాజిక వ్యవస్థలో మార్పు జరగాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా జాయింట్ సెక్రెటరీ తపసీ ప్రహరాజ్ అన్నారు. ఐద్వా ఆలిండియా మహాసభల సెమినార్‌లో పాల్గొనేందుకు ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు వచ్చిన ఆమెకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్‌లో ఆలిండియా మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భారతీయ సమాజంలో మహిళలపై దాడులు ఆగాలంటే కఠిన చట్టాలతో పాటు సామాజిక వ్యవస్థలో కూడా మార్పు రావాల్సిన అవసరముందన్నారు.
మేజర్లు ఇష్టపడి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటే, ఆ హక్కును కాలరాస్తూ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఇందుకు నిదర్శనమే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన అని గుర్తు చేశారు. దేశంలో ఇలాంటి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన, జమ్ము కాశ్మీర్‌లోని ఖథువాలో ఎనిమిదేండ్ల బాలికపై జరిగిన ఉదంతం, మణిపూర్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పైగా నిందితుల పక్షానే కేంద్ర ప్రభుత్వం నిలవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఐద్వా సెంట్రల్ కమిటీ సభ్యురాలు ఆశాలత మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగే ఆలిండియా మహాసభల విజయవంతం కోసం ఇంటింటి ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత, కోశాధికారి షాహిన్ పాల్గొన్నారు.
మహిళల భద్రతకు కఠిన చట్టాలు రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



