చేతులు, కాళ్లు కట్టేసి, మూతికి ప్లాస్టర్ వేసి.. కెప్టెన్ ఇంట్లో నేపాలి ముఠా భారీ చోరీ
నవతెలంగాణ-కంటోన్మెంట్
హైదరాబాద్‌లోని కార్ఖాన పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. యజమాని ఇంట్లోనే నేపాలీ ముఠా దాడికి పాల్పడింది. దాదాపు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, కొత్త నగదును అపహరించుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే కెప్టెన్ గిరి ఇంట్లో గత రెండేండ్లుగా నేపాలికి చెందిన దంపతులు రాజేంద్ర సాహి(రాజు) అతడి భార్య పూజ పని చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.
యజమాని భార్య పంజాగుట్టలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో వారి ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. సినీ ఫక్కీ తరహాలో యజమాని గిరి నిద్రిస్తున్న సమయంలో నేపాలీ దంపతులు రాజు, పూజతో పాటు మరో నలుగురు అతన్ని తాళ్లతో చేతులు, కాళ్ళు కట్టేశారు. మత్తు మందు తాగించడానికి ప్రయత్నించగా ఆయన అడ్డుకున్నారు. ఇంట్లో ఉన్న 25 తులాల బంగారం, రూ. 23 లక్షల నగదుతో పాటు గిరి ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ టీమ్‌లతో సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
నేపాలి ముఠాను త్వరలో పట్టుకుంటాం : ఏసీపీ రమేశ్
దొంగతనంపై కార్ఖానా ఏసీపీ రమేశ్ స్పందిస్తూ నేపాలి దొంగల ముఠాను త్వరగా పట్టు కుంటామని తెలిపారు. దొంగతనం సమయంలో ఇంట్లో యజమాని ఒక్కడే ఉన్నాడని తెలిపారు.యజమాని భార్య పంజాగుట్టలోని బంధువుల ఇంటికి వెళ్లిందని అన్నారు. పక్కింటి వాళ్ళ సహాయంతో గిరి పోలీసులను సంప్రదించాడని తెలిపారు. కేసు నమోదు చేసి ఆరు బృందాలతో గాలింపు చేస్తున్నామని తెలిపారు. ఇంట్లో పని చేస్తున్న మరో మహిళకు మత్తు మందు ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని ఏసీపీ తెలిపారు.



