నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి సుమారు 32 మంది చనిపోయినట్లు సమాచారం. బ్రిడ్జి కూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ మైనింగ్ సైట్‌లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది.
కాంగోలోని చాలా మంది ప్రజలకు ఈ రాగి మైనింగ్ జీవనాధారం. కనీసం 15-20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృతిచెందారు.



