వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ డిమాండ్
నవతెలంగాణ – అచ్చంపేట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇందిరమ్మ ఆత్మీయ పరుస పథకం కింద ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారంగా కూలీలకు సంవత్సరానికి రూ.12,000 ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అమ్రాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల తో సమావేశం నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ శైలేంద్ర కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
దిక్కులేని మహిళలకు ప్రతి నెల రూ. 2500/-ఇస్తామని అన్నారు. నేటికీ అమలు చేయడం లేదు. కొన్ని జిల్లాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.6000/- ఇచ్చారు. మిగతా రూ.6000/- చెల్లించాలన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చడానికి తొలగించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి కూలీలందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉపాధిహామీ కూలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. కూలీలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు దాటిన కూలీలకు పెన్షన్ రూ.5000 ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పర్వతాలు, అడ్డా కూలీల సంఘం నాయకులు వెంకటయ్య, జి రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ మల్లేష్ఎ, ఏమ్మార్పీఎస్ నాయకులు సిహెచ్ నిరంజన్, రాములు , రైతు సంఘం నాయకులు వెంకటయ్య, పర్వతాలు, కూలీలు అంజమ్మ, భాగ్యమ్మ, సులోచన, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.



