Tuesday, November 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రమాదాల నుంచి పాఠాలు నేర్వరా?

ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వరా?

- Advertisement -

ఇటీవల జరిగిన కర్నూల్‌, చేవెళ్ల రోడ్డు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేశాయి. ఘటన జరిగిన రెండు మూడు రోజులు అధికారులు హడావుడి చేశారు. జనం సోషల్‌ మీడియాలో సినిమా చూసినట్లు ఆ దుర్ఘటన దృశ్యాలను చూసి అయ్యో పాపం అనుకున్నారు, సానుభూతి ప్రకటించారు అంతే. ఇక అధికార యంత్రాం గం రొటీన్‌ పనిలో పడిపోయింది. ఆ రెండు ఘోర ప్రమాదాలను మరచిపోయి దైనందిన జీవితంలో బిజీ అయిపో యారు. దేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. జరుగుతున్న ఈ ప్రమాదాలకు కారణాలను కనుగొని నివారించే చర్యలకు పాలకులు పూనుకోక పోవడం దురదృష్టకరం. ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చేదెప్పుడు? ప్రజల్ని కాపాడేదెప్పుడు అన్న సందేహం ఎవరికైనా రాకమానదు.

కొన్ని సర్వేల ప్రకారం రహదారి భద్రత విషయంలో మన దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తేల్చబడింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2021 సంవత్సరంపు నివేదిక ప్రకారం ఆ ఏడాది దేశంలో 1,55,627 మరణాలు జరిగాయని ,ఇందులో 69 వేల 240 మరణాలు ద్విచక్ర వాహనాల కారణంగానే జరిగాయని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మరణిస్తున్న 199 దేశాల్లో భారత మొదటి స్థానంలో ఉండటం చూస్తుంటే ఆందోళన కలిగిస్తుంది. దేశంలో యేటా దాదాపు 4.5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అందులో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గడచిన పదేండ్ల కాలంలో దేశంలోని వివిధ రోడ్లపై జరిగిన వివిధ ప్రమాదాల్లో 13 లక్షల మంది మరణిస్తే 50 లక్షల మంది గాయాల పాలై రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 77 వేల మంది, తెలంగాణలో 71 వేలమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలొదిలారు. ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మృతిచెందుతున్నారు. ఇక తెలంగాణాలో ఈ ఏడాది జనవరి మాసం నుంచి సెప్టెంబర్‌ వరకు జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 7,333 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 2,702 మంది ప్రాణాలు కోల్పోగా, 8,118 మంది క్షతగాత్రులయ్యారు.ఈ గణాంకాలు చూస్తుంటే ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ, తగ్గినట్లు కనిపించడం లేదు. అతివేగం, సెల్ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయటం ,ఏమాత్రం బాధ్యత లేకుండా మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి రావటం, సిగల్స్‌ జంపింగ్‌, రోడ్ల నిర్మాణంలో లోపాలు లాంటి తప్పిదాలు వల్లే సగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

తెలంగాణలో 6,417 కి.మీ పొడవునా జాతీయ ,రాష్ట్ర రహదారులున్నాయి. ప్రతి కిలోమీటర్‌కు సగటున ఒక్కో రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్లు రాష్ట్ర పోలీసు శాఖలోని రోడ్డు భద్రత విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరి పాలకులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు? రోడ్ల నిర్వహణను ఏ ప్రభుత్వాలు కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. జాతీయ,రాష్ట్ర రహదారుల పైన బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించటం,తగు జాగ్రత్తలు తీసుకోవడంలో జరిగిన వైఫల్యాల వల్లే రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. ఇక ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్లపైకి ఎక్కి మృత్యు శకటాలుగా మారి ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. రోడ్డు భద్రత చట్టాల అమలులో తీవ్రమైన వైఫల్యం కనిపిస్తోంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో ఇప్పటికీ అనేక లోపాలున్నాయి. డ్రైవింగ్‌పై కనీసం అవగాహన లేకుండానే వాహనాలతో రోడ్లెక్కి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఆర్టీఏ అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

రోడ్డు భద్రత చట్టాల అమలులో తీవ్ర లోపాలున్నాయని వాటిని సరిచేయాలని కేంద్ర ప్రభుత్వం వేసిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌ కమిటీ స్పష్టమైన సూచనలతో నివేదిక ఇచ్చింది. కానీ! సూచనలను కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సీరియస్‌గా తీసుకున్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా మనరాష్ట్రంలో స్టేట్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీ, డిస్టిక్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీలు మొక్కుబడిగానే ఉన్నాయి. కనీస కార్యా చరణ రూపొందించి అమలు చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. 2006లో కేంద్రం ఇచ్చిన రోడ్‌ సేఫ్టీ రూల్స్‌నే నేటికీ అమలు చేస్తున్నది. 2019లో కొత్తగా తీసుకొచ్చినటువంటి రోడ్డు భద్రతానియమాలను ఇంకా అమల్లోకి తేలేదు. అది అమలు చేయడం ద్వారా వాహనదారులకు చలాన్లు పెద్దఎత్తున పడతాయి. ప్రమాదాలు కూడా తగ్గే అవకాశముంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇంకా ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమలవుతున్న రోడ్డు సేప్టీ విధానాల్ని కూడా పరిశీలించాలి. రోడ్డు ప్రమాదాలను, మృతుల సంఖ్యను తగ్గించేందుకు స్వీడన్‌ అనుసరిస్తున్న ”విజన్‌ జీరో” విధానాన్ని కూడా మనం అమల్లోకి తీసుకురావాలి.

స్వీడన్‌ 1997 నుంచి ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆ దేశంలో రోడ్డు ప్రమాదాలను డెబ్బయి శాతానికి తగ్గించగలిగారు.ఇక ”అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సిస్టమ్‌” ను కూడా మనం అమల్లోకి తెచ్చుకొనే ప్రయత్నం చేయాలి. దీని ద్వార వాహనం దేనినైనా ఢీకొనే ముందు గుర్తించి ఆగిపోతుంది. దీంతో మనం ప్రమాదాలను చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. వీటన్నింటితో పాటు రహదారి భద్రత అంశాలపై ప్రభుత్వాలకు దూరదృష్టి అవసరం. పాఠశాల విద్య నుంచే ఈ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చడం వల్ల రానున్న కాలాల్లో మన దేశంలో,రాష్ట్రంలో ప్రమాదాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశం కలగుతుంది. ముఖ్యంగా ఈ అంశంలో పాలకులకు, అధికారులకు ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు.

పి.వి.రావు
9010153065

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -