Tuesday, November 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివి'పత్తి'

వి’పత్తి’

- Advertisement -

తెలంగాణలో పత్తి చేలు ఈ సీజన్‌లో గింజలతో కాదు, గాయాలతో తెల్లబారుతున్నాయి. చెట్లకు విచ్చుకున్న గుత్తుల్లా..గుమిగూడిన సమస్యలు అన్నదాత మెడకు ఉరిలా మారాయి. కనీస మద్దతు ధర కరువు, పెట్టుబడి బరువు, తేమపేరుతో దోపిడీ, దళారుల దందా.. ఇవన్నీ తేనెటీగల్లా దాడి చేస్తున్నాయి.ఆదివారం కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యువ రైతులు పురుగుల మందు తాగి బలవన్మరణం చెందడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. అయితే, ఈ ఆత్మహత్యలు ప్రభుత్వాల డొల్లతనాన్ని బహిర్గతపరిచాయి. నాలుగు పదులు కూడా నిండని యువకులు, జీవితాన్ని చూడాల్సినవారు అర్ధాంతరంగా చావుకెందుకు ఒడిగట్టాల్సి వచ్చింది? దీనికి ప్రకృతిపై నెపం వేయడంకంటే, పాలకవర్గాల నిర్లక్ష్యం అనడం సముచితం. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పంట నష్ట పరిహారంపై మీన మేషాలు లెక్కించడం, ప్రకటించిన మద్దతు ధరకు కూడా పత్తి కొనుగోళ్లు చేయకపోవడం ముందుకొచ్చిన ప్రధాన సమస్యలు.

ఇలాంటి సమ యంలో భరోసానిచ్చి బతుకుదారి చూపాల్సిన పాలకులు వాటిని విస్మరించడం అంతకన్నా శోచనీయం. అందుకే ఇప్పుడు రైతుల మెదళ్లలో ఒకేఒక ప్రశ్న- ‘నా చెమటకు గిట్టుబాటు ధర దొరుకుతుందా?’ అని. కాయాకష్టం చేసి సాగు చేయడం ఒక ఎత్తయితే, అమ్ముకోవడం అంతకన్నా ఇబ్బందిగా తలెత్తడం నిజంగా బాధాకరం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీసీఐ) ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపడతామని కేంద్రం ప్రకటించింది. క్వింటాల్‌కు రూ. 8110 నిర్ణయించింది. కానీ ఆ ధరకు ఎక్కడా కొనుగోళ్లు చేయడం లేదు. పైగా కార్పొరేట్లకు ఊతమిచ్చే విధానాల్ని అమలు చేస్తున్నది. ఎనిమిది శాతం తేమ పేరుతో ధరను దిగ్గోస్తున్నది. ఇందులో కూడా ఓ తిరకాసు. శీతాకాలం, అందులో మంచు ప్రభావం, మొన్నటివరకు మొంథా తుఫాన్‌ బీభత్సం చాలాచోట్ల పత్తి ఎర్రబారింది. పైగా వేల ఎకరాలు ముగిపోయింది. ఆ బాధతోనే కదా రైతులు కుమిలిపోతూ తనువు చాలిస్తున్నారు. ఆదిలాబాద్‌ లాంటి జిల్లాలోనైతే ఉష్ణోగ్రతలు ఎనిమిది నుంచి పదికి పడిపోతున్నాయి. అక్కడ తేమ పదిహేను నుంచి ఇరవై శాతం చూపిస్తున్నది.

ఇలాంటి సమయంలో పత్తికి నియమాలు పెట్టడం ప్రయివేటువారికి లబ్ది చేకూర్చడానికే కదా! ఆదిలాబాద్‌ జిల్లాలో కేంద్రం ఓ పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టింది. రైతులు సీసీఐ కేంద్రాల్లో కాకుండా బయట కూడా పత్తిని అమ్ముకోవచ్చని చెప్పింది.అయితే వ్యాపారులు క్వింటాల్‌ ఎంత ధరకు కొన్నా, మిగతా మద్దతు బ్యాలెన్స్‌ తామే చెల్లిస్తామని చెప్పింది. అలాంటప్పుడు కొనుగోలు కేంద్రాలెందుకు? రానున్న రోజుల్లో సీసీఐని ఎత్తేసి కార్పొరేట్లకు కట్టబెట్టే పన్నాగం ఇందులో దాగుంది! మరో సమస్య ఎకరాకు ఏడు క్వింటాళ్ల నిబంధన. సీసీఐ లెక్క ప్రకారం పన్నెండు క్వింటాళ్లు కొనుగోలు చేయాలి. హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిన్న, సన్నకారు రైతులకు అశనిపాతంగా మారింది. అలాగే కిసాన్‌ కపాస్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ విధానం. మారుమూల ప్రాంతాల రైతులకు ఇది సాధ్యమయ్యే పనేనా? రైతు ఫోన్‌ నెంబర్‌ మారినా, భూభారతిలో వివరాలు లేకపోయినా కేంద్రాల నుంచి వెనుతిరగాల్సిందే. అష్టకష్టాలు పడి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి కొన్నిరోజులకు సమాచారం వస్తుంది. కిరాయి పెట్టుకుని ట్రాక్టర్లలో పత్తిని తీసుకెళ్లాక, అంతా పరిశీలించి ‘చావు కబురు చల్లగా చెప్పినట్టు’ తేమ బాగా ఉందని తిరస్కరిస్తున్నది.

అప్పటివరకు కండ్లల్లో వత్తులేసుకుని చూసిన రైతులు చేసేదేమీలేక బయట దళారులకు క్వింటాల్‌కు రూ.6400 చొప్పున అమ్ముతూ నష్టపోతున్న దైన్యస్థితి. ఇలా రోజుకో నిబంధనలు పెడుతూ పత్తి రైతుల్ని నిలువునా ముంచుతున్నది ఎవరో కాదు, కేంద్రమే. ఈ ఆంక్షల్ని ఎత్తివేయాలని, నిబంధనల్ని సడలించాలని రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కారు. ఇక్కడ బీజేపీకి ఎనిమిది ఎంపీలున్నా నిత్యం ఎన్నికలు, రాజకీయాలు, విమర్శలతో కాలయాపన చేస్తున్నారే తప్ప, రైతాంగాన్ని పట్టించుకోకపోవడం విచారకరం. ఇదంతా ఓ వైపు నడుస్తుండగానే రాష్ట్రంలో జిన్నింగ్‌మిల్స్‌ మూతపడటంతో అడపాదడపా జరిగే కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి.

ప్రభుత్వమే జిన్నింగ్‌లను లీజుకు తీసుకుని పత్తి బేళ్లను తయారు చేస్తుంది. ఇందులో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 నిబంధనలు అమలు చేయడంతో నష్టపోతున్నామని ట్రేడర్స్‌ యూనియన్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్టట్టు’ రైతుకు ఇది మరో దెబ్బ. వ్యవసాయమంటే వ్యాపారం కాదు, వారి జీవనాధారం. రైతు ఉత్పత్తికి న్యాయం, శ్రమకు తగిన ఫలితం, గిట్టుబాటు ధర హామీ, పాలకుల దయాదాక్షిణ్యంతో ఇచ్చేదనుకుంటే పొరపాటు, ఇది వారి హక్కు. నిజానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర సరిపోదు. క్వింటాల్‌కు రూ. 10,075 ఇవ్వాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని రైతు సంఘాల డిమాండ్‌. రైతు శ్రేయస్సు కోరుకోవడం, ఆ దిశగా వారిని ఆదుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -