Tuesday, November 18, 2025
E-PAPER
Homeఆటలుఎన్నాళ్లీ సెల్ఫ్‌ గోల్‌?

ఎన్నాళ్లీ సెల్ఫ్‌ గోల్‌?

- Advertisement -

స్పిన్‌ గోతిలో పడుతున్న మన బ్యాటర్లు
సొంతగడ్డపై ఊహించని పరాభవాలు

ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది నానుడి. టెస్టు క్రికెట్‌లో టీమ్‌ ఇండియా అటు రచ్చ నెగ్గటం లేదు, ఇటు ఇంట మెప్పించటం లేదు. గౌతం గంభీర్‌ చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత స్వదేశంలో భారత టెస్టు రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. 12 ఏండ్లు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ ఓడని భారత్‌.. గత ఏడాది న్యూజిలాండ్‌ చేతిలో ఏకంగా వైట్‌వాష్‌ ఓటమి చవిచూసింది. 15 ఏండ్లుగా భారత్‌లో ఓ టెస్టు మ్యాచ్‌ విజయం ఎరుగని దక్షిణాఫ్రికా తాజాగా ఈడెన్‌గార్డెన్స్‌లో అదిరే విజయం అందుకుంది. జట్టులో నైపుణ్య లేమి, పేలవ ఆటతీరు కాకుండా.. వ్యూహమే ఓటమికి కారణమవుతోంది. అదే ఇప్పుడు ఘాటు విమర్శలకు దారితీస్తోంది.

నవతెలంగాణ క్రీడావిభాగం
టెస్టు మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ర్యాంక్‌ టర్నర్‌లతో టెస్టు క్రికెట్‌ భవిష్యత్‌కు ప్రమాదం. ఇదీ గతంలో విదేశీ మీడియా, మాజీ క్రికెటర్లు భారత పిచ్‌లపై చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు అటువంటి కామెంట్లు వినిపించటం లేదు. ఎందుకంటే, ఆ పని మన మాజీ క్రికెటర్లే చేస్తున్నారు. మన బలం ప్రత్యర్థికి మరింత బలం చేకూర్చకూడదు. ప్రస్తుతం స్వదేశంలో స్పిన్‌ పిచ్‌లు భారత్‌కు ఇదే కీడు చేస్తున్నాయి. మన స్పిన్‌ బౌలింగ్‌ నాణ్యతలో పెద్దగా మార్పు లేదు. కానీ నాణ్యమైన స్పిన్‌ను ఆడటంలో మన బ్యాటర్లు మరీ తీసికట్టుగా తయారయ్యారు. ఇక్కడే సమస్య ఉత్పన్నం అవుతోంది. దేశవాళీలో స్పిన్‌ పిచ్‌లు పరుగుల వరద పారించిన క్రికెటర్లు సైతం.. టెస్టుల్లో స్పిన్‌ వికెట్‌పై పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. భారత్‌ తక్షణమే స్పిన్‌ బలహీనత నుంచి బయటపడాలి. అప్పుడే స్వదేశంలో మన బలం మనకు మాత్రమే బలంగా ఉంటుంది. లేదంటే, పేస్‌ పిచ్‌లతో సొంతగడ్డ అనుకూలత కోల్పోయే ప్రమాదంలో పడటం ఖాయం.

ఇదేం కూర్పు
ఈడెన్‌గార్డెన్స్‌లో టీమ్‌ ఇండియా తుది జట్టు కూర్పుపై విమర్శలున్నాయి. తుది జట్టులో ఇద్దరే స్పెషలిస్ట్‌ బ్యాటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్‌ నిరాశపరచగా.. శుభ్‌మన్‌ గిల్‌ మెడ గాయంతో ఆటకు దూరమయ్యాడు. ముగ్గురు వికెట్‌ కీపర్లు, నలుగురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకున్నారు. స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ను పక్కనపెట్టి స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను నం.3 పొజిషన్‌లో ఆడించారు. వాషింగ్టన్‌ సుందర్‌ మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ మ్యాచ్‌తో వేశాడు. బౌలర్‌గా అతడిని వాడుకోలేదు. కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌ ముగ్గురూ వికెట్‌ కీపర్లే. రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపర్‌గా ఆడగా.. రాహుల్‌, జురెల్‌ ఇద్దరూ స్పెషలిస్ట్‌ బ్యాటర్లుగా తుది జట్టులో నిలిచారు. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ నలుగురూ స్పిన్నర్లు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ స్పెషలిస్ట్‌ పేసర్లుగా జట్టులో నిలిచారు. ర్యాంక్‌ టర్నర్‌పై నలుగురు స్పిన్నర్లతో మాయ చేయాలని చూసిన భారత్‌.. అదే పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేసేందుకు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు కావాలనే సంగతి మరిచిపోయింది. ఇక్కడే మ్యాచ్‌ భారత్‌ నుంచి దూరమైంది. ఆల్‌రౌండర్లు, వికెట్‌ కీపర్ల మయంగా మారిన తుది జట్టు… స్పిన్‌ పిచ్‌పై విలవిల్లాడింది. భారత్‌కు మరో దారుణ పరాజయాన్ని మిగిల్చింది.

గతంలోనూ ఇదే తీరు
స్వదేశంలో టీమ్‌ ఇండియాకు తిరుగులేదు. ఇది గత చరిత్రగా మారుతోంది. నిరుడు మూడు టెస్టుల కోసం భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్‌ ఊహించిన షాక్‌ ఇచ్చింది. చారిత్రక సిరీస్‌ విజయంతో పాటు క్లీన్‌స్వీప్‌ విక్టరీ నమోదు చేసింది. బెంగళూరు, పుణె, వాంఖడెలో భారత్‌పై న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది. బెంగళూరులో నల్ల మట్టి పిచ్‌, పుణెలో నల్ల మట్టి పిచ్‌ సహజంగా స్పిన్‌కు అనుకూలం. కానీ వాంఖడెలో ఎర్ర మట్టి పేస్‌కు అనుకూలం. అయినా, అక్కడా స్పిన్‌దే హవా. దీంతో ప్రత్యర్థి స్పిన్నర్లు మ్యాజిక్‌లో ముందంజ వేశారు. ఫలితంగా భారత్‌ 0-3తో టెస్టు సిరీస్‌లో ఓడింది. 12 ఏండ్ల తర్వాత స్వదేశంలో సిరీస్‌ ఓటమి చూసింది. ఈ సిరీస్‌కు గౌతం గంభీర్‌ భారత జట్టు చీఫ్‌ కోచ్‌.

స్పెషలిస్ట్‌లు అవసరం
చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌కు బలమైన ఇష్టాలు, అయిష్టాలు కనిపిస్తాయి. గంభీర్‌ చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు క్రికెటర్లు జాతీయ జట్టు ప్రణాళికల్లో లేకుండా పోయారు. పేసర్‌ మహ్మద్‌షమి రంజీల్లో ఆడుతూ ఫామ్‌, ఫిట్‌నెస్‌ చాటుకున్నాడు. కానీ అతడికి జట్టులో లేదు. యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ దేశవాళీలో పరుగుల వరద పారించాడు. పేస్‌కు ఎదుర్కొలేడనే కారణంతో అతడిని పక్కనపెట్టారు. న్యూజిలాండ్‌తో ఓడిన బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ భారీ ఇన్నింగ్స్‌తో రాణించిన సంగతి తెలిసిందే. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడే సర్ఫరాజ్‌ ఖాన్‌ను స్వదేశీ టెస్టులకు ఎందుకు దూరం పెట్టాల్సి వస్తుంది?. శ్రేయస్‌ అయ్యర్‌ స్పిన్‌కు బాగా ఆడే భారత ఆటగాళ్లలో ముందుంటాడు. ఇప్పుడు గాయంతో అతడు సెలక్షన్‌కు దూరంగా ఉన్నా.. గంభీర్‌ అయ్యర్‌ను టెస్టు జట్టుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు. స్పెషలిస్ట్‌ బ్యాటర్లు, స్పిన్‌.. పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని కఠిన పరిస్థితుల్లో పరుగులు చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. కానీ ఆటేతర అంశాలతో వాళ్లు జట్టులోకే రావటం లేదు. ఏదో ఓటమి చెందారని విమర్శ చేయటం కాదు కానీ.. ఈడెన్‌గార్డెన్స్‌ టెస్టుకు నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు వికెట్‌ కీపర్లతో తుది జట్టు కూర్పు చేయటం గంభీర్‌ వ్యూహనికే చెందింది. భారత జట్టు స్పిన్‌ కావాలని కోరలేదని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం తెలిపినా… స్వదేశీ టెస్టుకు ఆతిథ్య జట్టు ఇష్టాలకు భిన్నంగా ఎక్కడ పిచ్‌ రూపకల్పన జరుగదనే సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -