పరిమితులు ఉల్లంఘిస్తే ఎన్నికలు ఆపుతాం : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ రిజర్వేషన్ కోటా పరిమితులను ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.2022లో జేకే బాంథియా కమిషన్ తన నివేదికలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. దానికంటే ముందున్న పరిస్థితి ప్రకారం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరుమాల్యా బాగ్చిలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అయితే మహారాష్ట్ర సర్కార్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది.
అయితే ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ”ఇప్పటికే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, కోర్టు తమ ఆర్డర్‌ను నిలిపివేయాలన్నదే పిటిషన్ సారాంశమైతే, మేము ఎన్నికలను నిలిపివేస్తాం. ఈ సర్వోన్నత న్యాయస్థానం అధికారాలను మీరు పరీక్షిం చవద్దు. రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని మేము ఎప్పుడూ పెంచాలని అనుకోలేదు. ఈ ధర్మాసనంలో కూర్చున్న మేము అలా చేయలేము కూడా. బాంథియా కమిషన్ నివేదిక ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉంది. అందుకే అంతకు ముందు ఉన్న పరిస్థితి ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి మేము అనుమతిస్తున్నాం” అని మహారాష్ట్ర సర్కార్‌కు సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ఒకప్పుడు 70 శాతం మేర రిజర్వేషన్లు ఉన్నాయిగా!
కొన్ని సందర్భాల్లో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో 70 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.కాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు సోమవారంతో ముగిసిందని, సుప్రీంకోర్టు మే 6న ఇచ్చిన ఉత్తర్వును పరిగణనలోకి తీసుకునే ఈ ఎన్నికలు నిర్వహించడానికి మహారాష్ట్ర సర్కార్ సిద్ధమైందని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ”మాకు పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది. బంథియా కమిటీ నివేదికకు ముందు ఉన్న పరిస్థితిలు కొనసాగవచ్చని మేము సూచన చేశాం. అయితే దీని అర్థం 27 శాతం రిజర్వేషన్లు అన్ని వర్గాలకు వర్తింపజేయాలనా? ఒక వేళ అదే జరిగితే, మేము ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలు, గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధం అవుతుంది” అని పేర్కొన్నారు.
మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్
మహారాష్ట్రలోని 246 మున్సిపల్ కౌన్సిల్స్, 42 నగర పంచాయతీలకు ఈ ఏడాది డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం, నవంబర్ 10-17 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. దీని తర్వాత నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడానికి నవంబర్ 25 వరకు గడువు ఇచ్చారు. దీని తర్వాత నవంబర్ 26న అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. డిసెంబర్ 2న ఎన్నికలు అయిన తర్వాత డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
స్థానికంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు
- Advertisement -
- Advertisement -



