హెటీరో పరిశ్రమ కాలుష్య కుంపటి
భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యమయ్యాయి
ఈ నీరు తాగండంటూ పీసీబీ అధికారితో వాగ్వాదం
మూడు నెలలు దాటినా పట్టించుకోరా అంటూ నిలదీత
కలెక్టరేట్ ముందు దోమడుగు గ్రామస్తుల ఆందోళన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
హెటీరో పరిశ్రమ వదులుతున్న కాలుష్యం వల్ల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? అంటూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు గ్రామస్తులు కాలుష్యం నీళ్ల బాటిళ్లతో ఆందోళన నిర్వహించారు. దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువును విషపూరితం చేస్తున్న హెటిరో డ్రగ్స్ (యూనిట్-1) కంపెనీకి వ్యతిరేకంగా, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. తమ గ్రామానికి రసాయన వ్యర్థ జలాలు వస్తున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రసాయన నీళ్ల కారణంగా తమ గ్రామ పరిధిలోని నల్లకుంట చెరువు ఎర్రగా మారిపోయిందన్నారు. హెటీరో కంపెనీ వ్యర్థ జలాలు తమ చెరువులో కలుస్తున్నాయని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా తమ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) రాంచంద్రపురం ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (ఈఈ) కుమార్ పాఠక్ బాధితుల వద్దకు రావడంతో దోమడుగు గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. నిరసనకారులు కలుషిత జలాలను అధికారిపై పోసే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులకు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. దాంతో కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి..
గ్రామ ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యను కలిసి, తమ కాలుష్య సమస్యను వివరిస్తూ.. వినతి పత్రాన్ని సమర్పించారు. హెటీరో డ్రగ్స్ యూనిట్ 1 కంపెనీ వదులుతున్న విష రసాయనాల కారణంగా నల్లకుంట చెరువుతో పాటు భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యం అయ్యాయన్నారు. కాలుష్యపు ఘాటైన వాసనల వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కలుషిత నీరు కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని, ఆ నీటిని తాగి పాడి పశువులు, దూడలు చనిపోతున్నాయని కలెక్టర్‌కు తెలిపారు. కాలుష్యం వల్ల గ్రామంలో క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరిగాయని, చిన్న పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో కాలుష్యానికి కారణమవుతున్న హెటీరో డ్రగ్స్ యూనిట్ -1 పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని, కంపెనీ యాజమాన్య ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాలుష్యం వల్ల నష్టపోయిన గ్రామ ప్రజలకు, రైతులకు, పశువుల యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని, నిర్లక్ష్యం చేస్తున్న పీసీబీ ఉన్నతాధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దోమడుగు గ్రామ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్లు బాల్ రెడ్డి, మంగయ్య, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, స్వేచ్చారెడ్డి, అఖిల, జయమ్మ, చింతల రాజు, శ్రీధర్, జంగా రమేష్, సత్తిరెడ్డి, యాదగిరి, శ్రీను, టీపీజేఏసీ జిల్లా చైర్మెన్ వై. అశోక్ కుమార్, నాయకులు ఆర్.లక్ష్మి, చంద్రారెడ్డి, బీసీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్, కన్వీనర్ మల్లికార్జున్ పాటిల్, నాయకులు తదితరులు ఉన్నారు.



