Tuesday, November 18, 2025
E-PAPER
Homeఆటలుఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉండటం చాలా కష్టం : కేఎల్ రాహుల్

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉండటం చాలా కష్టం : కేఎల్ రాహుల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని కెప్టెన్లు ఎదుర్కొనే ఒత్తిడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు నెలల ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి, 10 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన దానికంటే ఎక్కువ మానసికంగా, శారీరకంగా అలసిపోతామని అన్నాడు. ఫ్రాంచైజీ యాజమాన్యాల నుంచి ఎదురయ్యే నిరంతర ప్రశ్నలు, సమీక్షలే ఈ తీవ్ర ఒత్తిడికి కారణమని పరోక్షంగా వెల్లడించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్, ఐపీఎల్ కెప్టెన్సీ అనేది కేవలం మైదానంలో వ్యూహాలు రచించడం మాత్రమే కాదని, ఫ్రాంచైజీ యాజమాన్యంతో నిరంతర సమీక్షలు, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్రికెట్ నేపథ్యం లేని ఫ్రాంచైజీ యజమానులకు ఆటలోని సూక్ష్మ నైపుణ్యాలను వివరించడం చాలా కష్టమైన పని అని అభిప్రాయపడ్డాడు. ప్రతి చిన్న విషయానికి కెప్టెన్లు, కోచ్‌లు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇది మానసికంగా ఎంతో కుంగదీస్తుందని వివరించాడు.

ఆటగాళ్ల ఎంపిక, వ్యూహాల్లో మార్పులు వంటి విషయాలపై కెప్టెన్లు, కోచ్‌లను పదేపదే ప్రశ్నిస్తారని రాహుల్ వివరించారు. “ఆ మార్పు ఎందుకు చేశారు? అతను తుది జట్టులో ఎందుకున్నాడు? ప్రత్యర్థి 200 పరుగులు చేస్తే మనం కనీసం 120 ఎందుకు చేయలేకపోయాం? వాళ్ల స్పిన్నర్లు అంత బాగా ఎలా బౌలింగ్ చేయగలుగుతున్నారు?” వంటి ప్రశ్నలు ఎదురవుతాయని ఉదహరించాడు. ఇలాంటి పరిస్థితి అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండదని, అక్కడ కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ఆటపై పూర్తి అవగాహన ఉంటుందని స్పష్టం చేశారు. క్రికెట్‌లో అన్ని విభాగాల్లో రాణించినా కొన్నిసార్లు విజయం దక్కదని, ఈ నిజాన్ని క్రికెట్ ఆట గురించి పెద్దగా తెలియని ఫ్రాంచైజీ యాజమాన్యాలకు అర్థమయ్యేలా చెప్పడం ఒక సవాల్ అని అన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -