Wednesday, November 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'కుల దురహంకార' చీకట్లు

‘కుల దురహంకార’ చీకట్లు

- Advertisement -

అత్యంత ఆధునికత సమాజమని చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా ‘కుల దురహంకారం’ అనే ఆదిమకాలపు జాడ్యం ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఇటీవల జరుగుతున్న వరుస ఘాతుకాలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌కు ఆనుకుని కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌లో తాజాగా జరిగిన కుల దురహంకార హత్య మరొకసారి మన సమాజంలో వేళ్లూనుకుని ఉన్న ఈ జాడ్యాన్ని బయట పెట్టింది. తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో, అతని అన్నను అమ్మాయి కుటుంబ సభ్యులు హత్య చేయడం కేవలం ఓ కుటుంబ వైరమో, వ్యక్తిగత కక్షో కాదు. ఇది మనం 21వ శతాబ్దంలోనే ఉన్నామా? లేక మధ్య యుగాల్లో ఉన్నామా? అనేప్రశ్న లేవనెత్తుతుంది. అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలతో శభాష్‌ అనిపించుకుంటున్న సమాజంలో కులం పేరుతో మను షులను చంపడం ఏం న్యాయం?
ప్రేమించి పెండ్లి చేసుకోవడమే ఆ యువతీ యువకులు చేసిన నేరమా? కన్నబిడ్డల ప్రాణాలకంటే కట్టుకున్న కులపు గోడలే బలమైనవా? నాగరిక సమాజమని చెప్పుకుంటున్న మనం..కులం పేరుతో కత్తులు నూరుతున్న అనాగరిక చర్యలను ఎలా సమర్థించుకోగలం? రాష్ట్రంలో ఇటీవలికాలంలో పేట్రేగిపోతున్న కుల, మత దురహంకార హత్యలు,వాటి వెనుక ఉన్న మనువాద భావజాలం అభివృద్ధికి ఆటంకాలు కాదా? మన ప్రభుత్వాలు, పాలకులు, మేధావులు ఎందుకు ఆలోచించడం లేదు? అన్నదే ప్రశ్న.పరువు పేరిట జరుగుతున్న ఈ కులదురహంకార హత్యలు…కేవలం ప్రేమ మీద మాత్రమే జరుగుతున్న దాడులు కాదు. ప్రగతిశీల భావాల మనుగడ మీద జరుగుతున్న అకృత్యాలు. మిర్యాలగూడలో ప్రణరు, భువనగిరిలో నరేశ్‌, సూర్యాపేటలో కృష్ణా, హైదరాబాద్‌లో హేమంత్‌ ఇలా చెప్పుకుంటూ పోతే యాదాద్రి, ఆసిఫాబాద్‌ లాంటి అనేక ఘటనలు నేటి ఆధునిక సమాజానికి మాయని మచ్చలు. హయత్‌నగర్‌లో వేరే కులం వాడిని ప్రేమించిందని అక్కను తమ్ముడు హత్య చేసిన తీరు ఇప్పటికీ మరచిపోలేం. ఇలాంటివి ఎన్నో సమాజంలో జరుగుతున్నాయి. వెలుగులోకి వచ్చేవి కొన్నే. తెలియనవి, పంచాయితీల ముసుగులో మరుగునపడినవి మరెన్నో.
షాద్‌గర్‌లో తమ్ముడు కులాంతర వివాహం చేసుకుంటే అతని అన్నను అమ్మాయి తండ్రి చంపడం దారుణం. అతను కూడా కులాంతర వివాహం చేసుకున్నవాడే. మాట్లాడేది ఉందని, పది నిమిషాల్లో పంపిస్తా మని భార్యకు చెప్పి హత్యకు ఒడిగట్టడం సాటి మనిషి మీద కూడా నమ్మకం సన్నగిల్లేలా చేస్తోంది. ఇలాంటి సంఘటనలు మానవత్వానికి మాయని మచ్చగా, కులోన్మాదానికి పరాకాష్టగా మారాయి. పరువు అనే ముసుగులో కన్న వారితో పాటు వారికి సహకరించారనే పేరుతో బంధువులను, కుటుంబీకులనూ చంపేయడం ఎంతవరకు సరైంది? దీనివల్ల వారు బాగుపడిందేమీ లేదు. అమృత తండ్రి మారుతీరావు చివరికి ఏమి చేసుకున్నాడో సమాజం చూసింది.
ఇప్పటికీ సంప్రదాయం ముసుగులో కులం పేరుతో ప్రేమను, వివా హాన్ని, బంధాలను నియంత్రించాలని చూసే కుటుంబాలు, మూడో వ్యక్తుల జీవితాలపై తీర్పులు చెప్పే పెద్దమనుషులు, పాత నమ్మకాల్ని పట్టుకున్న సమాజం ఇవన్నీ కలిసి విపరీతమైన హింసకు దారి తీస్తున్నాయి. షాద్‌నగర్‌ ఘటనలో కూడా అదే జరిగింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న జంటను అణగదొక్కడానికి, వారిని శిక్షించడానికి, ‘పరువు’ పేరుతో అరాచకానికి తెగబడ్డారు. అన్నను హత్య చేయడం ద్వారా ఎవరి గౌరవ మైన పెరిగిందా? కుటుంబం పరువు బలపడిందా? చివరికి అక్కడ మిగిలింది బంధువుల రోదనలు, మృతదేహం, పగిలిపోయిన రెండు ఇండ్లు మాత్రమే.
టెక్నాలజీ పెరిగినా, సమాజం ఆధునికతను సంతరించుకుంటున్నా కులోన్మాదం, మతోన్మాదం పెట్రేగిపోతూనే ఉంది. దీన్ని కొంతమంది పెంచి పోషిస్తున్నారు. వారు చెప్పినట్టుగా ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ నడుస్తోంది. ప్రణరు హత్య నుంచి తాజాగా రాజశేఖర్‌ హత్య వరకూ వాటిపై పాలకపార్టీల నేతలు స్పందించిన దాఖలాలు లేవు. బాధితులు కేసులు పెట్టినా వెంటనే శిక్షలు పడటం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కేంద్ర పెద్దలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులే ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్టుగా వదిలేస్తుంటే అడ్డుకట్ట పడేదెప్పుడు? షాద్‌నగర్‌లో రాజశేఖర్‌ను తీసుకెళ్తున్న సమయంలో తండ్రిపై కూతురు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని విమర్శలు. ఆ రోజే పోలీసులు తక్షణం స్పందించి ఉంటే ప్రాణం దక్కి ఉండేది. ఇప్పటివరకు ఇలాంటి హత్యలు జరిగిన ప్రతిచోటా పోలీసుల వైఫల్యం సుస్పష్టం. స్థానిక రాజకీయ నేతల ఒత్తిడులూ షరా మామూలే! పలు సంస్థలు చేపట్టిన నిజనిర్దారణ కమిటీల్లో తేలిన సత్యమిది.
ఘటన తర్వాతే అందరూ స్పందిస్తారు. అధికారులు చర్యలు తీసుకున్నట్టు చెప్పుకుంటారు. పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామంటారు. కొన్ని రోజులకు మళ్లీ నిశ్శబ్దం. ఇలాంటి కేసులు ఏండ్ల తరబడి కోర్టుల్లో వేలాడకుండా, ప్రత్యేక కోర్టుల ద్వారా తీర్పు రావాలి. దోషులకు శిక్ష పడితేనే, కులగర్వం పేరుతో చంపే నేరాలు ఆగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -