Wednesday, November 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎయి'డెడ్‌' కళాశాలలు!

ఎయి’డెడ్‌’ కళాశాలలు!

- Advertisement -

ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్యవరకు సమాజంలో ఎంతోమందిని తయారుచేసిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు పాలకుల విధానాల మూలంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు లేరన్న సాకుతో వాటి మూసివేతకు రంగం సిద్ధం చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఈ కళాశాలలను ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతోనే ఈ దశకు చేరినట్టు విద్యావేత్తల అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా 53 జూనియర్‌ కళాశాలలు వివిధ యజమాన్యాల కింద పనిచేస్తుండగా వాటిలో ప్రస్తుతం 10 నుండి 12 కళాశాలలు మాత్రమే నడుస్తున్నాయి. వాటిలో పనిచేసే అధ్యాపకులు రిటైర్మెంట్‌ కావడం వల్ల అవి కూడా నామమాత్రంగా తయారయ్యాయి. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో కేవలం రెండువేల మందికి మించి చదువుకోవటం లేదు. ఈ కళాశాలల్లోనూ కేవలం 250 బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కూడా వచ్చే ఏడాది వరకు చాలామంది పదవీ విరమణ చేయనున్నారు.

నాటి ఉమ్మడి ఏపీలో కొంతమంది విద్యావేత్తలు బడుగు బలహీన వర్గాల విద్యనుద్దేశించి ప్రభుత్వ అనుమతితో ప్రయివేటు కళాశాలల్లో ఈ విద్యాసంస్థల్ని నెలకొల్పారు. నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 1977 నుండి బాలికల కళాశాల స్థాపించి ఐదేండ్లు పూర్తి చేసుకున్నవాటికి గ్రాంట్‌ ఎయిడెడ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అటు తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వం దీనిపై 1985లో విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు కాలేదు. ఆర్టికల్‌ 37, ఆర్టికల్‌ 26 తీసుకొచ్చి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించింది. అప్పటినుండి కళాశాలల్లో నియామకాలు జరగలేదు. అటు తర్వాత ప్రభుత్వం గ్రాంట్‌ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. దీంతో పాటు కళాశాల అనుమతులు, విధానాల్లో కూడా మార్పులొచ్చాయి. కళాశాలల అనుమతిని ఇంటర్‌ బోర్డుకు అప్పగించింది. దీంతో ఇబ్బడిముబ్బడిగా ప్రయివేటు కళాశాలలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎయిడెడ్‌ కళాశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో చేరడం వల్ల వాటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధ్యాపకులను నియమించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.1996-2006 వరకు దశాబ్దకాలంగా ఎలాంటి నియామకాలు జరగలేదు. దీనికి తోడు 2005లో ప్రభుత్వం జీవో నెంబర్‌ 33 తీసుకొచ్చింది. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే ఆ కోర్సులను రద్దుచేయాలని చెప్పింది. అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులను రీ ఎంప్లారుమెంట్‌ పేరుతో ప్రభుత్వ కళాశాలలకు బదిలీ చేసింది. ఇది జీవో 89కి పూర్తి విరుద్ధం.

దశాబ్ద కాలం పాటు నియామకాలపై సర్కార్‌ అప్రకటితమైన నిషేధాన్ని అమలు చేసింది. చివరకు దాన్ని స్థిరీకరించుకోవడానికి 2006లో జీవో 35ను తెచ్చి ఎయిడెడ్‌ వ్యవస్థకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఈ జీవో కారణంగా ఆయా కళాశాలలో రిటైర్‌ అయిన లేదా, పదోన్నతిలో రిలీవ్‌ అవడం వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పదకొండు కళాశాలలు మూతపడ్డాయి. హైదరాబాద్‌ నగరంలో ఎంతోకాలం విద్యనందించి, విద్యార్థులను తీర్చిదిద్దిన నాగార్జున, సెయింట్‌ ఆన్‌, ఫ్రెండ్స్‌, సెయింట్‌ జోసెఫ్‌, చాణక్య ,రామచంద్రా లాంటి కళాశాలలు మూతపడ్డాయి. వరంగల్‌లో ఎంతోమంది మేధావులను తయారు చేసిన పోతన, ఖమ్మంలో వివేక, ఏపీ కళాశాలలు, అలాగే రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో నెలకొల్పినవి కూడా మూతపడ్డాయి. దీంతోపాటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అనేకమంది అధ్యాపకులను ప్రభుత్వం రీ ఎంప్లారుమెంట్‌ పేరుతో ప్రభుత్వ కళాశాలలో బోధన కోసం పంపింది. అరకొరగా అక్కడక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకు కూడా నెలనెలా జీతాలు ఆలస్యం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు విద్యార్థుల పరంగా, అటు అధ్యాపకుల పరంగా, ఏ విధంగా చూసినా ఎయిడెడ్‌ కళాశాలలు పూర్తిగా మూసివేసే దశకు చేరాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కళాశాలలపై దృష్టి సారించాలి. వాటిని మూసివేస్తే వచ్చే లాభనష్టాల్ని ఆలోచించాలి.విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి.

  • వాడపల్లి రమేష్‌, 9490099432
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -