చదువుకుంటూనే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అసాంఘిక శక్తులపై పోరాటం చేసేవాడు విద్యార్థి. అతని నిస్వార్థపు ఆలోచనలు, చర్యలు దేశ నిర్మాణానికి, ప్రగతికి దోహదం చేస్తాయి. తెలంగాణ రాష్ట్ర విద్యాకమిషన్ తన సిఫారసులలో విద్యార్ధి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే యూనివర్సిటీలుప్రజాస్వామ్య భావాలతో ఉంటాయని తన నివేదికలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మళ్లీవిద్యార్ధి సంఘాల ఎన్నికల గురించి చర్చ మొదలైంది. తెలంగాణలో ఉన్నత, సాధారణ విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు గత దశాబ్దంగా నిలిచిపోయిన స్థితి ఎవరికీ తెలియని విషయం కాదు. విద్యార్థుల రాజకీయ శక్తిని చూసి భయపడే ప్రభుత్వాలు, యూనివర్సిటీలు ఈ ఎన్నికలను నిషేదించడం వలన క్యాంపసుల్లో ప్రజాస్వామ్య వాతావరణం క్షీణించింది. విద్యార్థి సంక్షేమానికి, విద్యా నాణ్యతకు, క్యాంపస్ హక్కుల రక్షణకు ఎన్నికైన ప్రతినిధులు అవసరమన్న వాస్తవం మరింత స్పష్టమవుతున్నది.
విద్యార్థి సంఘాలు అనేవి కేవలం రాజకీయ పోటీ వేదికలు కాదు, అవి విద్యార్థుల ప్రతిరోజు సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య వేదికలు. హాస్టల్ ఫీజులు, ట్రాన్స్‌పోర్ట్, ప్రయోగశాల సామగ్రి, భద్రత, లైబ్రరీ సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లు వంటి అనేక అంశాలు ఎన్నికైన సంఘాలు ఉన్నప్పుడు మాత్రమే పారదర్శకంగా చర్చలకు వస్తాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికలను నిషేధించిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులొచ్చాయి. విద్యార్థి సమస్యలు అణచివేయబడ్డాయి. యూనివర్సీ టీలు, విద్యలో ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు పెరిగాయి.క్యాంపసుల్లో భయానక వాతావరణం పెరిగింది.విద్యరంగంలో పెరుగుతున్న ప్రయివేటీ కరణ, విద్య వాణిజ్యకరణ వ్యతిరేకంగా స్వరాలు బలహీనపడ్డాయి. ప్రతి ప్రభుత్వానికి విద్యార్థి నాయకత్వంపై ఒక భయం ఉంటుంది. ఎందుకంటే క్యాంపసుల్లో చైతన్యం పెరిగితే, అది ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుందని. తెలంగాణలో కూడా అదే జరిగిందన్నది వాస్తవం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల నుంచి, విద్యా బడ్జెట్ కోతల వరకు అనేక అంశాలపై విద్యార్థి లోకం వీధుల్లోకి రాకుండా నిలుపుదల చేయడానికి ఎన్నికలను రద్దుచేసింది.
క్యాంపసుల నుండే అనేక మంది విద్యార్ధి నాయకులు దేశ రాజకీయాల్లో నాయకులుగా ఎదిగారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ నేతలుగా ఎదిగిన అనేకమంది దేశానికి ప్రధానులు, రాష్ట్రపతులు, ఆయా రాష్ట్రాలకు సీఎంలుగా ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం సెంట్రల్ వర్సిటీలు, కొన్ని రాష్ట్ర విశ్వవిద్యా లయాల్లో తప్పితే ప్రభుత్వాలు విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించడంలేదు. దీంతో సమాజానికి, దేశానికి నిస్వార్థంగా పనిచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తగ్గిపోతున్నారు. 1980-85 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లోని విశ్వ విద్యాలయాల్లో జరిగిన కొన్ని హింసాత్మక సంఘటనల వల్ల విద్యార్థి సంఘ ఎన్నికలను ప్రభుత్వాలు రద్దుచేశాయి. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మాజీ ఎన్నికల అధికారి జె.ఎం. లింగ్డో అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. 2006 సెప్టెంబర్‌లో ఆ కమిటీ ప్రతిపాదించిన రిపోర్టును అమలు చేయాలని యూనివర్సిటీలకు, కాలేజీలకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో కేంద్ర విశ్వవిద్యాలయాలైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని వర్సిటీల్లో కొన్నిచోట్ల మాత్రమే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎనభయ్యవ దశకంలో విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచి, అభివృద్ధి వైపు నడిపించాయి. విద్యాసంస్థల్లో ఈ ఎన్నికల నుంచి ప్రేరణ, చ్కెతన్యం పొంది రాజకీయాలలోకి వచ్చిన అనేక మంది సాధారణ విద్యార్థులు నేడు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. అయితే1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో దేవేందర్ యాదవ్ అనే విద్యార్థి హత్య జరిగిందనే నెపంతో అప్పటి పాలకులు ఈ ఎన్నికలపై నిషేధం విధించారు.విద్యార్థి సంఘ ఎన్నికల జరిగిన కాలంలో విద్యార్థులందరూ సామాజిక స్పృహతో చైతన్యంగా ఉండేవారు. నాణ్యమైన విద్యాబోధన డిమాండ్ చేయడంతో పాటు కాలేజీ, హాస్టల్ ఫీజులు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వంతో పోరాటం చేసేవారు. విద్యా ప్రయివేటీకరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచేవి. ప్రశ్నించేతత్వం ప్రతి విద్యార్థిలో ఉండటంతో విద్యా సంస్థలు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేసేవి. అటు సామాజిక ఉద్యమాల్లోనూ విద్యార్థులు కీలకపాత్ర పోషించేవారు.నేడు విద్యార్థి ఎన్నికలు లేకపోవడంతో వారి డిమాండ్లను లేవనెత్తడం, ఆయా యాజమాన్యాలను, ప్రభుత్వాలను సంప్రదించి, పరిష్కరించడం సవాలుగా మారింది. కొన్నేండ్లుగా తెలంగాణ యూనివర్సిటీలు, కళాశాలలకు సరైన నిధుల కేటాయింపులు లేక మౌలిక సదు పాయాలందక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రొఫెసర్ల నియామ కాలు లేవు. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడా అంతే. దీంతో యూనివర్సిటీలలో విద్యాబోధన నిలిచిపోయి పరిశోధనలు కుంటు పడ్డాయి. యూనివర్సీటీల ప్రతిష్ట మసకబారుతోంది.
ప్రతి ఏడాది జరిగే విద్యార్థి సంఘం ఎన్నికల్లో అనేక సమస్యలు చర్చకు వస్తాయి. వివిధ బావజాలాల మధ్య స్నేహపూర్వక చర్చ-ఘర్షణ ఉంటుంది. ఇది గమనిస్తూ ఎన్నికల్లో పాల్గొనే సాధారణ విద్యార్థులు కూడా సమాజం పట్ల కొంత జ్ఞానాన్ని పెంపొందించుకొని మార్పు వైపు ప్రయాణించేవారు. విద్యార్థుల హక్కులకై, వారి సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలతో, పాలక ప్రభుత్వాలతో నిత్యం సంప్ర దింపులు, పోరాటం కొనసాగడం వల్ల విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందేవి. బహుజన సమూహాల విద్యార్థులు నాయకులుగా ఎదిగేవారు. ఇది ఇష్టం లేని పాలక వర్గాలే ఈ మూడున్నర దశాబ్దాలుగా ఎన్నికల వైపు తొంగిచూడటం లేదు. పైగా నిషేధాన్ని కొనసాగిస్తూనే ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలను, సంఘాలను అణచివేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి విద్యార్థుల పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఒకవైపు విద్యార్థి సంఘం ఎన్నికలపై నిషేధాన్ని కొనసాగిస్తూ, మరోవైపు విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలనడం మోసం చేయడమే. తక్షణమే విద్యార్థి ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. అందుకు గతంలో భారత మాజీ ఎన్నికల అధికారి జె.యం లింగ్డో కమిటీ సూచనలు పాటిస్తూ, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
దేశంలో విద్యా ప్రయివేటీకరణ వేగవంతమ వుతున్నది. ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటుకు మొగ్గుచూపు తున్నది. నిరుద్యోగం, కులం, మతం, ప్రాంతాల పేరుతో విద్వేషాలు సృష్టించడం కూడా ఈ పదకొండేండ్ల కాలంలో పరిపాటిగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసే అనేక వైపరీత్యాలు జరుగుతున్నాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కనీసం వారి హక్కుల కోసం గళం ఎత్తలేని అచేతన స్థితిలో ఉంటున్నాయి. విద్యార్థి సంఘం ఎన్నికల అంశం తెరమీదకు వచ్చినప్పుడల్లా పాలకవర్గాలు, ఆయా యూనివర్సిటీల యాజమా న్యాలు శాంతిభద్రతల అంశాన్ని సాకుగా చూపు తున్నాయి. శాంతిభద్రతలే సమస్యైతే సాధారణ ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు? ఇప్పటికైనా విశ్వ విద్యాలయాలు, కాలేజీల్లో ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రజా నాయకులను, సామాజికవేత్తలను దేశానికి అందించవలసిన ఆవశ్యకత ఉన్నది.
టి.నాగరాజు
9490098292
విద్యార్థి సంఘాల ఎన్నికలు-ఆవశ్యకత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



