Wednesday, November 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజిన్నింగ్‌ మిల్లర్లతో చర్చలు సఫలం

జిన్నింగ్‌ మిల్లర్లతో చర్చలు సఫలం

- Advertisement -

నేటి నుంచి యధావిధిగా పత్తి కొనుగోళ్లు
మిల్లర్లకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకరిస్తాం
రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడొద్దు : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయనీ, బుధవారం నుంచి యధావిధిగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లోనూ జిన్నింగ్‌ మిల్లులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామనీ, మిల్లర్లకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో, సీసీఐతో మిల్లర్లు పోరాడాలనీ, రైతులకు ఇబ్బందులు సృష్టించడం తగదని హితవు పలికారు. జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యలపై నివేదిక తయారు చేసి కేంద్ర జౌలిశాఖ అధికారులకు పంపాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్‌ గుప్తా, జిన్నింగ్‌ మిల్లర్ల అసోసియేషన్‌తో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యలపై చర్చించారు. మిల్లర్లు తమ సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడం సమంజసం కాదన్నారు. జిన్నింగ్‌ మిల్లుల సమస్యలపై సమ్మెలాంటి విధానంతో కాకుండా సామరస్యంగా కేంద్రంతో పోరాడుదామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను 18 క్వింటాళ్లకు కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25 క్వింటాళ్లకు పెంచిందనీ, సేకరించే సోయా చిక్కుడు పరిమితిని ఎకరానికి 6.72 క్వింటాళ్లకు కుదిస్తే 10 క్వింటాళ్లకు పెంచి సేకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కౌలు రైతులకు ఇబ్బందులు కలగకుండా నాఫెడ్‌ తీసుకొచ్చిన ఆధార్‌ గుర్తింపుతో పాటు మొబైల్‌ ఓటీపీతో కూడా కొనుగోళ్లు జరపాలని సూచించారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ పత్తి రైతులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ కూడా కేంద్రం మరో నిబంధన పెట్టిందన్నారు. అకాల వర్షాలు, మొంథా తుపాను వంటి సహజ విపత్తులు వచ్చి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ అవన్ని పట్టని కేంద్ర ప్రభుత్వం 12 శాతం తేమ నిబంధనను పెట్టడం దారుణమని విమర్శించారు.

జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌ 1 నుంచి ఎల్‌ 12 వరకు కేటగిరీలుగా విభజించడాన్ని తప్పుబట్టారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన జిన్నింగ్‌ మిల్లుర్లు పత్తి కొనుగోళ్లు నిలిపివేశారని గుర్తుచేశారు. రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. మిల్లర్లు కేంద్రంపై పోరాడాలిగానీ రైతులకు నష్టం కలిగించొద్దని కోరారు. పత్తి, సోయా, మొక్కజొన్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పనిచేస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శించడమే ధేయంగా బీఆర్‌ఎస్‌ వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నామనీ, కేంద్ర మంత్రులకు, అధికారులకు పదేపదే విజప్తులు చేశామని గుర్తుచేశారు. పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కూడా చర్చించామని తెలిపారు. రైతుల విషయంలో తమకు మూడోవ్యక్తి జోక్యం అవసరం లేదనీ, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -