కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తోణుకునూరు సైదులు గౌడ్
నవతెలంగాణ – నూతన్ కల్
మండల పరిధిలోని వెంకేపెళ్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ ఏకపక్ష నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తోనుకునూరు సైదులు గౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తుంగతుర్తి నియోజకవర్గం లో గత 15 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేక నాయకులు, కార్యకర్తలు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయి ఉన్నారని అన్నారు. గత బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆర్థిక ప్రలోభాలు పెట్టిన లొంగక నమ్మిన కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం పనిచేశారని గుర్తు చేశారు.
పార్టీ రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ పార్టీ నుండి నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులకే శాసనసభ సభ్యులు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆ గ్రామానికి 17 ఇండ్లు మంజూరు కాగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కమిటీతో లబ్ధిదారులను గుర్తించి 17 మంది పేర్లతో ఒక లిస్టును ఎమ్మెల్యేకు ఇచ్చినట్లు తెలిపారు. నూతనంగా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే ముఖ్య అనుచరులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు 17 మంది పేర్లతో మరో లిస్టును ఎమ్మెల్యేకు ఇచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు ఎమ్మెల్యేలు కలిసి అర్హులు అయిన పేద కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యతలో ఇల్లు ఇవ్వాలని కోరారు.
కానీ చివరికి లబ్ధిదారుల ఎంపికలో బిఆర్ఎస్ నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకుల లిస్టులో ఉన్న పేర్ల లో 14 మందిని లబ్ధిదారులను ఎంపిక చేసి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శాసనసభ సభ్యులు స్పందించి వర్గ పోరు లేకుండా ఇరు వర్గాల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. లేనిపక్షంలో ఇండ్ల నిర్మాణానికి చేసే శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుంట చంద్రారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట పవన్ రెడ్డి, నాయకులు పాల్వాయి పర్షరాములు, సైరెడ్డి ఆదిరెడ్డి, పాల్వాయి కార్తీక్, పాల్వాయి రాజశేఖర్, గంధసిరి శ్రీధర్, పాల్వాయి భారతమ్మ రమ్య ,ఎల్లమ్మ ,మంగమ్మ ,సుశీల ,మాతంగి ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.



