నవతెలంగాణ-హైదరాబాద్: జనతా దళ్ యునైటెడ్ (JDU) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో బుధవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో నితీశ్ ఎన్నిక జరిగింది. దీంతో ఈరోజు సాయంత్రం ఎన్డీయే నేతగా నితీశ్ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా గవర్నర్‌కు అందజేస్తారు. ఈనెల 20న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, ఎన్డీయే కూటమి ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 243 స్థానాలకు 202 సీట్లు గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మహాగఠ్‌బంధన్ 35 స్థానాలకే పరిమితమైంది. ఎన్డీయే కూటమిలోని బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 సీట్లు, ఎల్‌జేపీఆర్‌వీ 19, హెఏఎంఎస్ 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి. మహాకూటమిలోని ఆర్జేడీ 25 సీట్లు, కాంగ్రెస్ 6, సీపీఐఎంఎల్ 2, ఐఐపీ 1, సీపీఎం 1 స్థానం గెలుచుకున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసిన ఏఐఎంఐఎం 5, బీఎస్‌పీ ఒక సీటు గెలుచుకున్నాయి.



