నవతెలంగాణ – అచ్చంపేట
ఈ దేశంలో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీకి పేరు వచ్చిందని, తాను ప్రధానమంత్రిగా ఉంటూ సీలింగ్ యాక్ట్ అమలు చేసి నిరుపేదలకు భూములు పంపిణీ చేసిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం శ్రీశైలం నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతూ అచ్చంపేటకు వచ్చారు. ఈ క్రమలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడారు.
ఆనాడు బ్యాంకులను జాతీయం చేస్తూ పేదల కోసం కూడు, గూడు, గుడ్డ అందించే విధంగా పాలన సాగించాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పుట్టి 142 సంవత్సరాలు అవుతుంది. భారత రాజ్యాంగ సంరక్షణ కోసం కాంగ్రెస్ పని చేస్తుందని, కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి బిజెపికి లేదన్నారు. సోనియాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తీసుకోలేదన్నారు. నెహ్రూ కుటుంబం ఆస్తులు, పదవులు, ప్రాణాలు సైతం దేశం కోసం త్యాగం చేశారని అన్నారు. పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆలోచన విధానంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారని మరోసారి గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు యువత ముందుండి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి నేడు టీపీసీసీ అధ్యక్షుల వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, ఉమామహేశ్వరం దేవస్థానం కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా అనంతరెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి నరసయ్య యాదవ్, మహబూబాబాద్ తదితరులు ఉన్నారు.



