2030 వరకు 5కిలోల ఉచిత బియ్యం
ఆయిల్ సీడ్స్, వాణిజ్య పంటలూ పండించాలి : కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి
నల్లగొండలో భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
”తెలంగాణకు రావాల్సిన కోవిడ్ సమయానికి సంబంధించి ప్రజాపంపిణీ వ్యవస్థ బకాయి నిధులు రూ.343 కోట్లు వెంటనే విడుదల చేస్తాం.. అలాగే సీఎంఆర్ డెలివరీకి సంబంధించి 10 ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 1400 కోట్లకు సరైన రికార్డులు సమర్పిస్తే పరిశీలించి మంజూరు చేస్తాం..” అని కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్‌జోషి చెప్పారు. ఆహార భద్రతలో భాగంగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నామని, దాన్ని 2030 వరకు కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్టు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ మహా విపత్తులో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహార భద్రత కింద పేదలందరికీ 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇవ్వడం ప్రారంభించినట్టు చెప్పారు.
దేశవ్యాప్తంగా వ్యాప్తంగా 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. ప్రతినెలా తెలంగాణకు 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు కేటాయిస్తున్నామని, లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3370 మెట్రిక్ టన్నుల గోధుమలు ఇస్తున్నట్టు చెప్పారు. ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు రేషన్ కార్డులన్నిటినీ డిజిటలైట్ చేసినట్టు తెలిపారు. నల్లగొండ జిల్లా ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని, ప్రస్తుతం ప్రారంభించిన ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంలో 62 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని అన్నారు. ప్రభుత్వం భూమి ఇస్తే మరో ఎఫ్‌సీఐ గోదామును జిల్లాలో నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 2014 -15 నుంచి తెలంగాణలో ధాన్యం సేకరణను 600శాతం పెంచినట్టు చెప్పారు. రైతులు వరి ధాన్యం వైపే కాకుండా ఆయిల్ సీడ్స్, వాణిజ్య పంటలు పండించాలని కోరారు.
బత్తాయి కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలి : మంత్రి కోమటిరెడ్డి
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా బత్తాయి పంటకు ప్రసిద్ధి చెందిందని, జిల్లాకు 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన బత్తాయి కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ధాన్యానికి సంబంధించి ప్రయివేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంజూరు చేయాలని అన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, భారత ఆహార సంస్థ ఈడి వనిత శర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ రాజు, ఎఫ్‌సిఐ అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ బకాయిలు రూ.1400 కోట్లు విడుదల చేయాలి : ఉత్తమ్
రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి 2024- 25 సంవత్సరానికి సంబంధించి బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని, పదేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.1400 కోట్ల సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి సబ్సిడీ రూ.343 కోట్లు వెంటనే విడుదల చేయాలని, 2024- 25 ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ కాలపరిమితిని 60 రోజులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. 2024-25 సంబంధించి యాసంగి 120 రోజులకు పెంచాలని, తెలంగాణకు అదనపు రేక్‌ల సౌకర్యాన్ని కల్పించాలని, 2025-26కు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్‌ను 80 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి పెంచాలని అన్నారు. ప్రస్తుత ఎఫ్‌సీఐ గోదాంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు పెంచాలని కోరారు. తెలంగాణ ఖరీఫ్‌లో 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిందని, 80 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నదని, ఇదివరకే 29 వేల కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలుపై ఖర్చు చేసినట్టు తెలిపారు.



