నేడు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీ
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్లతో
వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని 3.50 లక్షల మంది స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం ఒకేసారి పంపిణీ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒకేసారి ఘనంగా నిర్వహించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందస్తుగా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌ను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి మండల సమాఖ్యతోపాటు గ్రామ సమాఖ్యలో ముఖ్యులందరూ హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేసిందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చిందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు దఫాలుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని అన్నారు. మంగళవారం మరోసారి పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు పంచబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు అద్భుతంగా నిర్వహించారని అన్నారు. ప్రతి మండలం నుంచి సమాచారం అందిందని చెప్పారు. నాణ్యతతో కూడిన మంచి డిజైన్లు కలిగిన చీరలను పంపిణీ చేశారంటూ మహిళా మణులు ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ చీరలు చేరవేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతం చేసినందుకు కలెక్టర్లను ఆయన అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు జమ చేయడం పట్ల పంచాయతీ, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సింది. రాష్ట్రంలోని 3,57,098 సంఘాలకు ఈ నిధులు చేరాయని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని వివరించారు. ఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నదని తెలిపారు. వాటికి వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లించడం కొనసాగుతోందని పేర్కొన్నారు. తాజాగా రూ.304 కోట్ల వడ్డీలను చెల్లించామని తెలిపారు. దీంతో ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ.1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చేరాయని వివరించారు. ఇవి కాకుండా పట్టణ మహిళా సంఘాలకు సుమారు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను చెల్లించామని తెలిపారు.
స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



