నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన దీక్షకు ప్రత్యేకత ఉందన్నారు. ఆనాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి అరవై ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఏటా 11 రోజులపాటు దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహిస్తున్నామని, హనుమకొండ, వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశంలో ముఖ్య కార్యకర్తలతో మమేకం కానున్నారని, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.


