నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోనేషియా సుమత్రా దీవిలో కురిసిన భారీ వర్షాలు అక్కడ భీకర వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వరదలకు 10 మంది మృతి చెందగా, ఆరుగురు గల్లంతు అయ్యారు. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని ఆరు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. వరదకు హిల్లీ గ్రామాలు నీట మునిగాయి. శిథిలాల మధ్య నుండి బాధితులను రక్షించేందుకు బృందాలు కృషి చేస్తున్నాయి. అత్యంత ప్రభావిత ప్రాంతమైన సిబోల్గా నగరంలో 5 మృతదేహాలు, ముగ్గురు గాయపడిన వారిని బయటకు తీశారు. ఇంకా నలుగురు కోసం గాలింపు కొనసాగుతుంది.
సెంట్రల్ టాపనులీ జిల్లాలో కొండచరియలు ఇళ్లపై పడడంతో నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందారు. సుమారు 2,000 ఇళ్లు వరదల్లో మునిగాయి. మండైలింగ్ నటల్‌లో వంతెన కొట్టుకుపోయింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో పర్వతాల నుంచి నీరు ముంచెత్తుతూ, ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలిపోవాలని హెచ్చరిస్తున్నారు. వర్షాలు కొనసాగితే ఇంకా కొండ చరియలు విరిగిపడే సంభవించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.



