నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వరి కొయ్యలను కాల్చితే నేలలోని సేంద్రియ పదార్థాలు, పోషకాలు నశిస్తాయి ఏఈఓ సంగీత రైతులకు సూచించారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ క్లస్టర్ లో వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. నేలలో ఉన్న వానపాములు, సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయని వివరించారు.వాయు కాలుష్యం పెరిగి కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులకు దారి తీస్తాయన్నారు.
పొగ వల్ల శ్వాస సమస్యలు, దగ్గు, కంటి మంట, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని తెలిపారు. పొలంలో గాలి ప్రసరణ, నీటి చొరబాటు తగ్గి తదుపరి పంట దిగుబడి పడిపోతుందని, భూమి గట్టిపడి నీరు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.కోత తర్వాత వరి కొయ్యలను కాల్చకుండా పొలంలో ఉంచాలని, అవశేషాలను చిన్న ముక్కలుగా చేయాలని, పొలంలో నీరు పెట్టి ట్రాక్టర్ రోటవేటర్ తో 25 రోజులలో రెండుసార్లు దమ్ము చేస్తే వరిగడ్డి కుళ్ళి పంటకు సేంద్రీయ కర్బనం అందుతుందన్నారు. తర్వాత వరి నాట్లు వేసుకోవాలని రైతులకు సూచించారు.



