నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలను కాపాడటానికి, పకడ్బందీగా చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. బుధవారం వి. సి సమావేశ మందిరంలో రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని అన్నారు. ఈ చర్యలను తీసుకోవడంలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని, ప్రతి శాఖ సమిష్టిగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఇకపై అక్కడ ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సూచించిన ప్రదేశాలలో ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి,నేషనల్ హైవే,అలాగే ఇతర శాఖలు పూర్తి సహకారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలన్నారు.
జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే మీద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్నచోట్ల ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
రోడ్లపై రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటి ఏర్పాటుచేయాలనిసూచించారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు సంభవించకుండ పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అధిక వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ పరిమితిని ఖచ్చితంగా అమలుచేయాలన్నారు. అవసరమైన చోట్ల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
డీసీపీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్పాట్స్ ని గుర్తించాలన్నారు. రోడ్డులు సరిగా లేని చోట్ల, వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులను, బ్రింకర్స్, స్పీడ్ లిమిట్ బోర్డ్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి, ఆర్ డి ఓ కృష్ణా రెడ్డి, జిల్లా రోడ్లు భవనాల అధికారి సరిత, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామరాజు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



