జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు మొదటి విడత నామినేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ జారి చేసి గురువారం ఉదయం 10.30 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వనపర్తి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఆర్.ఓ కేంద్రాల్లో ఎన్నికల నోటీస్ విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా ఎన్నికల అథారిటీ , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టడం జరిగిందన్నారు . రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే టి. పోల్ లో అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎఫ్.ఎస్.టి. , సర్వైలియన్ స్టాటిస్టిక్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు . ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగిందని, మరోసారి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
గురువారం ఉదయం జిల్లాలో మొదటి విడతలో నిర్వహించాల్సిన 5 మండలాలకు సంబంధించిన 87 గ్రామ పంచాయితీలు, 780 వార్డులకు గాను 30 క్లస్టర్లలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేసి ఉదయం 10.00 కు నోటిఫికేషన్ విడుదల చేసి 10.30 నుండి 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి.పి.ఓ తరుణ్ చక్రవర్తి , డీఎస్పీ వెంకటేశ్వర రావు, డి.ఎల్.పి.ఒ రఘునాథ్ రెడ్డి, ఎస్.హెచ్. ఒ లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



