ప్రమాద హెచ్చరికలు శూన్యం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారం వారి గూడెం – శ్రీరంగ పురం ను కలిపే అంతర్గత రహదారి, ఒకప్పుడు గ్రామాల్ని కలిపిన ఈ దారి నేడు మాత్రం అప్రోచ్ లేక గుండ్రంగా తెగిపోయిన చోట చదును కంటే గోతులు దర్శనం ఇస్తున్నాయి. రహదారి శిధిలం అయి నెలలు గడిచినా అక్కడ ప్రమాద హెచ్చరికలు ఏవీ కనిపించకపోవడం వాహనదారుల కళ్లలో ఆందోళనను నింపుతోంది. రాత్రివేళ ఈ రహదారిపై ప్రయాణం చేయడం అంటే నల్లటి నీటి అంచున నిలబడి నట్టు అనిపిస్తోందని పలువురు చెబుతున్నారు.
నారంవారిగూడెం – శ్రీరంగం పురాన్ని కలిపే ఈ మార్గంలో 2022 లో రెండు కల్వెర్ట్‌లు నిర్మించారు. కాంక్రీటు తో కల్వర్ట్ బలంగా ఉన్నా, అప్రోచ్ మాత్రం నాణ్యతా లోపంతో నిర్మించడంతో నిర్లక్ష్యంపై నిలిచింది. గత వర్షాకాలంలో అప్రోచ్ కోతకు గురై రహదారి కొట్టుకు పోయింది. అప్పట్లో కొంత మట్టి పోసి ‘తాత్కాలికం అనే ప్రాణవాయువు’ ఇచ్చి వదిలేశారు. తాజాగా తుపాను తాకిడికి మళ్లీ అదే భాగం కొట్టుకుపోయింది.చుట్టుప్రక్కల ఒక్క హెచ్చరిక బోర్డు లేదు. రహదారి అంచు నే నిలిచిన ప్రమాదం ఎవరిని చూపుతుందో నని గ్రామస్తులు, ప్రయాణికులు రోజూ రిస్క్ చేస్తూ ఆ దారినే వెళ్లాల్సి వస్తోంది.
స్థితిగతుల గురించి ఐటీడీఏ ఏఈఈ ప్రసాదరావు ను ప్రశ్నించగా “మరమ్మత్తుల నిమిత్తం సుమారు రూ.40 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలవుతాయి” అని తెలిపారు. అయితే ప్రతిపాదనలు తమ దారిలో నెమ్మదిగా నడుస్తుండగా, రహదారి మాత్రం ప్రతి వాహన దారునికి ఓ పరీక్ష లా ఎదుర్కొంటోంది. రహదారులపై ‘అతివేగం ప్రమాదం’ అని చెబుతున్నాం కానీ, నిర్మాణంపై నిర్లక్ష్యం కూడా ప్రమాదానికే మరో రూపం – అదే ఇక్కడ నిలచి ఉన్న కఠిన సత్యం.



