Wednesday, November 26, 2025
E-PAPER
Homeమానవికాక‌తీయ వీర వ‌నిత‌ రాణి రుద్రమ

కాక‌తీయ వీర వ‌నిత‌ రాణి రుద్రమ

- Advertisement -

ధీరత్వానికి, సాహసానికి మారు పేరు రుద్రమదేవి. కడవరకు యుద్ధరంగంలో మడమ తిప్పని వీరనారి. ఆమె వీర మరణానికి ధ్రువీకరణగా శిలా శాసనం కొలువై ఉంది. అదే చందుపట్ల శాసనమై.. చరిత్రకు ఆనవాలై వేనోళ్ల కీర్తింపబడుతోంది. చారిత్రక రా సముద్రం ఉన్నది కూడా ఈ ఊరిలోనే. వరంగల్‌ కేంద్రంగా పరిపాలన సాగించి 80 ఏండ్ల వయసులో శతృసైన్యంపై కత్తి దూసి కదనరంగంలో కన్నుమూసింది. ఈ శాసనం 1289 నవంబర్‌ 27న కాకతీయ వీరవనిత రాయగజకేసరి రాణి రుద్రమదేవి వీరమరణాన్ని ధృవీకరిస్తున్నది. ఆమె కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి దశాబ్ద కాలం గడిచినా నేటికీ ఆవిష్కరణకు నోచుకోలేదు. నేడు రాణి రుద్రమదేవి 736 వర్ధంతి సందర్భంగా ఆ శిలాశాసనానికి సంబంధించిన చారిత్రక విశేషాలు మానవి పాఠకుల కోసం…

నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామ శివారులో రాణి రుద్రమదేవి మరణ శిలాశాసనం ఉంది. దీంతో ఈ గ్రామం చరిత్ర పుటల్లోకి ఎక్కింది. రాణి రుద్రమదేవి మరణం గురించి వివరాలు తెలిపే వందల ఏండ్ల నాటి అరుదైన శిలాశాసనం చందుపట్ల గ్రామంలో ఉందన్న విషయాన్ని గ్రామానికి చెందిన ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ పెరంబుదూర్‌ రంగాచార్య, తెలుగు అధ్యాపకులు టంగుటూరి సైదులు, శాసన పరిశోధకుడు, చరిత్రకారుడు డి. సూర్య కుమార్‌, గ్రామానికి చెందిన కోటగిరి దైవదీనం నేతృత్వంలో వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో గ్రామ యువత కలిసి దశాబ్దం కిందటే గుర్తించారు.

అనేక పరిశోధనలు జరిపి
గ్రామం పడమటివైపు ఊరి వెలుపల పెద్ద ముత్యాలమ్మ గుడి దగ్గర ఈ శిలాశాసనాన్ని కనుగొన్నారు. సగానికి పైగా భూమిలోకి పూడుకుపోయిన దాన్ని పునరుద్ధరించారు. దీని కోసం అప్పటి కలెక్టర్‌ పురుషోత్తం రెడ్డి రూ.80 వేలు మంజూరు చేశారు. నకిరేకల్‌ నుంచి చందుపట్ల గ్రామంలోకి ప్రవేశించగానే అడుగుల గద్దెపై కొలువైన ఈ చారిత్రక శాసనం స్వాగతం పలుకుతుంది. ఈ శాసనం 1957లో బయటపడింది. 1987లో ప్రఖ్యాత చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి శిలాశాసనంపై అనేక పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ శిలా శాసనాన్ని 2003 నవంబర్‌ 27న గద్దెపై ప్రతిష్టించారు. ఇటీవల దొరికిన మెడిమెకల్‌ శాసనం కూడా చందుపట్ల శాసనం తిరుగులేనిదని బలపరుస్తున్నట్లు చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ నిర్ధారించారు.

చందుపట్ల శాసనంలో ఏముందంటే…
శత్రు రాజ్యాల రాజుల దాడులను తిప్పి కొట్టిన రుద్రమ చివరి ఘట్టం చందుపట్ల గ్రామ ప్రాంతంలో జరిగినట్లు చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుంది. పూర్వికులు రాజ్య పర్యటనలో భాగంగా వరంగల్‌, పిల్లలమర్రి నుండి ఇనుపాముల గ్రామం మీదుగా చందుపట్ల గ్రామానికి చేరుకొని శివ పూజలు నిర్వహించి పానగల్లు ప్రాంతానికి వెళ్లేవారని తెలుస్తుంది. ఈ ప్రాంతంలో వారికి కొంత సైన్యం ఉన్నట్లు శాసనం ద్వారా తెలుస్తుంది. చందుపట్లలో బయల్పడిన క్రీస్తు శకం 1289 నవంబర్‌ 27 నాటి శాసనమిది. రాణి రుద్రమదేవి వీరమరణం పొందినందుకు జ్ఞాపకార్థంగా ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయకుడు పువ్వుల ముమ్మడి ఈ శాసనం వేయించాడు. సోమనాధ దేవునికి కొంత భూమిని దానమిచ్చినట్లు ఈ శాసనం పేర్కొంటుంది. దీన్ని బట్టి ఈ శాసనం వేయించడానికి కొన్ని రోజుల ముందు అంటే క్రీ.శ 1289 నవంబర్‌ 27న మరణించినట్లు స్పష్టమవుతుంది. అప్పటికి రుద్రమదేవి 80 ఏండ్ల వృద్ధురాలై ఉండాలి. జన్మత సాహసవంతురాలైనందున ఆమె సైనికుల్లో ఉత్సాహం, ప్రేరణ కలిగించడం కోసం మల్లికార్జునుడి అండతో ఆ వయసులో కూడా సైన్యానికి నాయకత్వం వహించి ఉండవచ్చు. త్రిపురాంతకం శాసనాన్ని బట్టి అంబదేవుడితో పోరాడి ఆ యుద్ధంలో మల్లికార్జునుడితో సహా మరణించినట్లు తెలుస్తుంది. ఒక వృద్ధురాలిని చంపానని చెప్పుకోవడం తనంతటి యోధుడికి పరువు నష్టం కనుక ఈ విషయాన్ని అంబదేవుడు తన శాసనాలలో ఎక్కడా ప్రస్తావించలేదు.

ఆవిష్కరణకు నోచుకోని రుద్రమ విగ్రహం
చందుపట్ల గ్రామ స్టేజి వద్ద దాతల సహకారంతో ఏర్పాటు చేసిన రుద్రమదేవి విగ్రహం దశాబ్దం గడిచినా ఆవిష్కరణకు నోచుకోలేదు. వివేకానంద యువజన మండలి ప్రతినిధులు ప్రతిష్టించిన రుద్రమ మరణ శిలాశాసనాన్ని పరిశీలించేందుకు 2012 ఆగస్టులో నాటి కలెక్టర్‌ ముక్తేశ్వరరావు చందుపట్లకు రావడంతో ప్రతినిధులు శిలాశాసనం పరిస్థితిని వివరించారు. కాకతీయ రాణి రుద్రమ ఈ ప్రాంతంలో వీరమరణం పొందినందున ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, రుద్రమదేవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని యువజన మండలి సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. చందుపట్లలో రుద్రమదేవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నల్లగొండ ఎస్‌.బి.హెచ్‌ బ్యాంకు అధికారులతో మాట్లాడి రూ.6.50 లక్షలతో విగ్రహాన్ని తయారు చేయించారు. 10 అడుగుల ఎత్తు, 7 క్వింటాళ్ల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. రూ.2.50 లక్షలతో విగ్రహ ప్రతిష్ట దిమ్మెను ఏర్పాటు చేశారు. 2015లో దానిపై రుద్రమదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిష్టాపన సమయంలో విగ్రహానికి వేసిన ముసుగును పకృతి కరుణించి ఆవిష్కరించిందే తప్ప అప్పటి నుండి నేటి వరకు అధికారికంగా ఆవిష్కరించలేదు.

అమలు కాని హామీలు
ఏప్రిల్‌ 26, 2015లో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్‌ చందుపట్ల రామసముద్రం పూడిక సందర్భంగా గ్రామాన్ని సందర్శించారు. కాకతీయ ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తామని, గ్రామ ముఖ ద్వారంలో కాకతీయ ఆర్చి ఏర్పాటు చేస్తామని, చందుపట్ల గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. జులై 12, 2022లో నాటి గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ చందుపట్ల గ్రామాన్ని సందర్శించినా విగ్రహం కిందనే ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చందుపట్ల గ్రామాన్ని పర్యాటక స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని నాటి ప్రభుత్వానికి సూచించారు. అయినా నేటికీ ఏ ఒక్క హామీ నెరవేరిన దాఖలాలు లేవు.

కొరవడిన పట్టుదల
నకిరేకల్‌ నుండి తిప్పర్తికి రహదారిపై చందుపట్ల ముఖ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన గద్దెపై రుద్రమదేవి స్వాగతం పలుకుతుంది. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వివేకానంద యువజన మండలి చేసిన కృషి చాలా ఉంది. అడుగడుగునా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకెళ్లారు. వారి కష్టానికి ఫలితంగా ప్రతిష్టకు నోచుకున్న శాసనం వివరాలు దూరవిద్యను అభ్యసించే ఎంఏ తెలుగు విద్యార్థులకు ప్రథమ ఏడాది పాఠ్యాంశంగా చేర్చారు. ఆ తర్వాత ఇంటర్‌ చరిత్రలో, ఏడో తరగతి చరిత్రలో సైతం చందుపట్ల శాసనం పాఠ్యాంశంగా చేర్చేలా పాఠ్య ప్రణాళిక సంఘం వారిని ఒప్పించారు.

27న పద్య నాటక ప్రదర్శన
తెలంగాణ భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థల సౌజన్యంతో తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య నిర్వహణలో మహారాణి రుద్రమదేవి వర్ధంతి సందర్భంగా ఈనెల 27న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో తెలంగాణ నాటక కళాకారుల సమ్మేళనం జరుగుతుంది. మధ్యాహ్నం 2.00 గంటలకు వరంగల్‌ తెలంగాణ డ్రమెటిక్‌ అసోసియేషన్‌ ‘మహారాణి రుద్రమదేవి’పై చారిత్రక పద్య నాటకాన్ని ప్రదర్శిస్తారు.

రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
వీరనారి రాణీ రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలి. వరంగల్‌లో నిర్వహిస్తున్న మాదిరిగా కాకతీయ ఉత్సవాలను చందుపట్లలో కూడా జరపాలి. చందుపట్ల గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. రుద్రమదేవి కాంస్య విగ్రహ అధికారిక ఆవిష్కరణకు యువత కృషి చేస్తూ ఉంది. దానికి ప్రభుత్వం సహకరించాలి. – టంగుటూరి సైదులు, తెలుగు అధ్యాపకులు, చందుపట్ల

  • యరకల శాంతి కుమార్‌, నకిరేకల్‌, 9849042083.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -